తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి గురించి అందరికీ తెలుసని తెలిపారు.
తనతో పాటు బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించారని, జైల్లో వేశారని, ఈ విషయాలను ఎవరూ మర్చిపోలేదని బండి సంజయ్ చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, అయినప్పటికీ ధాటిగా వారు తట్టుకోలేనంతగా యుద్ధం చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్‌తో బీజేపీ చర్చలు జరిపిందన్న ప్రచారంలో నిజం లేదని తెలిపారు.
బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ అని, కవిత బెయిల్ వస్తుందనడానికి, బీజేపీకి ఏం సంబంధం అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీకి సంబంధముందా అని నిలదీశారు. కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్డడం సరికాదని తెలిపారు. నిజాయితీగా పనిచేసే ఐఏఎస్ లకూ నేటికీ పోస్టింగ్ ఇవ్వడం లేదని విమర్శించారు.
అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని తెలిపారు. కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయని చెప్పారు. ఏ పార్టీ గెలిస్తే పంచాయితీలు అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలని అన్నారు.