తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వివాదం రచ్చ రచ్చగా మారింది. స్పీకర్ పోడియం వైపు కోరుట్ల ఎమ్మెల్యే పేపర్లు విసిరేశారు. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సైతం పేపర్ బంచ్ ను విసిరేయడంతో వివాదం పెద్దదైంది. ఎమ్మెల్యే హరీశ్ రావు స్పీకర్ మెట్లు ఎక్కే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైపు దూసుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హెడ్ ఫోన్ ను విసిరేసే ప్రయత్నం చేశారు. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో స్పీకర్ సభను వాయిదా వేశారు.
Mana Telangana TV
తెలంగాణ మాజీ మంత్రిపై టీటీడీ చర్యలకు సిద్ధమవుతుందా?.. త్వరలోనే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?.. అంటే అవును అనే అంటున్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు..ఈ మేరకు ఆయన ఈ విషయం గురించి ట్వీట్ చేశారు. తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా ఊరుకునేది లేదన్నారు.
తిరుమల పవిత్ర క్షేత్రమని.. ఇది రాజకీయ వేదిక కాదన్నారు. ఎవరూ రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే టీటీడీ పాలకమండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటివారైనా సరే ఊరుకోమన్నారు.
తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నామన్నారు. అయితే ఆయనపై కేసు నమోదు చేస్తారా?.. టీటీడీ నిబంధనల ప్రకారం ఏవైనా చర్యలు తీసుకుంటారా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
పదేండ్లలో బీఆర్ఎస్ చేసింది 4.17 లక్షల కోట్లు మాత్రమే | అసెంబ్లీ సాక్షిగా కడిగి పారేసిన హరీశ్‌రావు
బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని, ఎవరైనా మళ్లీ రూ.7 లక్షల కోట్లు అని అంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 7 డిసెంబర్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు చేసిన అప్పు రూ.15,118 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పుల ఖాతాలో వేశారని మరోసారి స్పష్టంచేశారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. అప్పులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అప్పులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో వేసి తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ అప్పు బీఆర్ఎస్ ఖాతాలో వేస్తారా? ‘ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6.71 లక్షల కోట్ల అప్పు చేసినట్టు చూపించారు. ఇది పూర్తిగా తప్పు. భట్టి విక్రమార్క తన మేధస్సుతో ఉమ్మడి ఏపీలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులను కూడా బీఆర్ఎస్ ఖాతాలో జమచేశారు. 7 డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ, మార్చి వరకు కాంగ్రెస్ చేసిన రూ.15,118 కోట్ల అప్పును కూడా కలిపి బీఆర్ఎస్ ఖాతాలో వేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన రూ.72,658 కోట్లను కూడా మా ఖాతాలోనే కలిపారు. 2014 కంటే ముందు గ్యారెంటీల పేరు మీద వారసత్వంగా వచ్చిన అప్పు రూ.11,609 కోట్లు బీఆర్ఎస్ ఖాతాలోనే వేశారు. ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని రూ.99,385 కోట్ల అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.40 వేల కోట్లు అదనంగా అప్పుల భారం పడింది’ అని వివరించారు. భట్టి విక్రమార్క చెప్పినట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆపాదించిన రూ.6.71 లక్షల కోట్ల అప్పులో బీఆర్ఎస్ చేయని అప్పు రూ.99,385 కోట్లు, ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేని రుణాలు రూ.1.54 లక్షల కోట్లు తీసేస్తే.. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ సర్కార్ కుటిల ప్రయత్నంతో ఫార్ములా ఈ-కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై కేసు నమోదైంది. ఈ-కార్ రేసింగ్‌లో రూ.54.88 కోట్లు దుర్వినియోగం చేశారనే అభియోగంతో కేటీఆర్‌పై ఎంఏయూడీ సెక్రటరీ దానకిశోర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై ఇప్పటికే పథకం ప్రకారం గవర్నర్ అనుమతి సైతం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఐఏఎస్ దానకిశోర్‌తో ఫిర్యాదు చేయించి, అరెస్టు చేసేందుకు కుట్రలు పన్నిందని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. గవర్నర్ నుంచి అనుమతి లభించిన వెంటనే ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని మంగళవారం సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. దీంతో బుధవారం సాయం త్రం ఎంఏయూడీ సెక్రటరీ దాన కిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ తెలిపారు.
ఎన్నికల నియమావళిని ధిక్కరిస్తూ, ప్రభుత్వ అనుమతి లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా రూ.54,88,87,043 కోట్లను యూకేకు చెందిన ‘ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్’ (ఎఫ్ఈఓ) కంపెనీకి హిమాయత్‌నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి బదిలీ చేయించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఇతరులపై కేసు నమోదు చేశారు. ఐసీపీ (బీఎన్ఎస్) 13(1)(ఏ), 13(2), సీపీయాక్ట్ 409, 120 (బీ) సెక్షన్స్ కింద అభియోగాలు మోపారు. ఈ మేరకు నాంపల్లి ఏసీబీ కోర్టుకు ఏసీబీ అధికారులు వివరణ ఇచ్చారు. రూ.10 కోట్లకు మించి బదిలీ జరిగితే ప్రభుత్వం, ఆర్థికశాఖ అనుమతి అవసరమని, సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్‌కు స్పాన్సర్స్ లేక పోవడంతో హెచ్ఎండీఏ నిధులు మళ్లించారని, దీంతో విదేశీ కంపెనీకి చెల్లింపులతో హెచ్ఎండీఏకు అదనపు పన్ను భారమైందని దానకిశోర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేటీఆర్ సహా ఇతర అధికారులను విచారించేందుకు ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ బంజారాహిల్స్‌లోని కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా బృందాన్ని విచారణ కోసం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ టీమ్‌లో పది మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. విచారణ వివరాలు ఎప్పటికప్పుడు ఏసీబీ ఉన్నతాధికారికి, వారి నుంచి ప్రభుత్వానికి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో కేటీఆర్‌కు త్వరలోనే విచారణ నోటీసులను ఏసీబీ అధికారులు ఇవ్వనున్నారు. ఇప్పటికే కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలకు ఈ-కార్ రేస్ గురించి వాస్తవాలు వెల్లడించడంతో ఆయనను అక్రమంగానైనా అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే పలు అక్రమ అరెస్టులతో ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతో కేటీఆర్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ముగిసిన వెంటనే నోటీసులు అందజేస్తారని సమాచారం.
ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా అర్వింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డిని ఈ కేసులో నిందితులుగా ఏసీబీ పేర్కొంది. 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెక్షన్ యాక్ట్ కింద కేసులు ఫైల్ చేసిన అధికారులు.. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. 13 (1A), 13(2), 409,120 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదయ్యాయి.
ఈ మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఈడీ ఏసీబీ ఆఫీస్ కేంద్రంగా డైరెక్టర్ నేతృత్వంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(సీఐయూ) ఆధ్వర్యంలో ఈ కేసును దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి అరెస్టుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక విచారణ టైమ్‌లో న్యాయపరమైన చిక్కులు రాకుండా లీగల్ ఒపీనియన్ తీసుకుందని, హైప్రొఫైల్ కేసు కావడంతో వివరాలు రహస్యంగా ఉంచుతున్నట్లు సంబంధిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. నోటీసులు ఇవ్వగానే కేటీఆర్ సహా మిగతా వాళ్లను హెడ్ క్వార్టర్స్‌లోనే ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేసిన ఏసీబీ.. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తాజాగా ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ జాబితాలోనే తెలంగాణ విద్యాశాఖ 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.
పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే
- 2025 మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్
- 2025 మార్చి 22 న సెకెండ్ లాంగ్వేజ్
- 2025 మార్చి 24 న ఇంగ్లీష్ ఎగ్జామ్
- 2025 మార్చి 26 న మ్యాథ్స్
- 2025 మార్చి 28 న ఫిజికల్ సైన్స్
- 2025 మార్చి 29 న బయోలాజికల్ సైన్స్
- 2025 ఏప్రిల్ 2 న సోషల్ స్టడీస్
పదో తరగతి పరీక్షలు గతంలో మాదిరిగానే 80% మార్కులకు జరగనున్నాయి. వచ్చే ఏడాది 2025-26 నుంచి వార్షిక పరీక్షలు 100 మార్కులకు జరుగుతాయి. ఈ నిబంధనలో మార్చి 21 నుంచి ప్రారంభం అయ్యే మార్కులు 80% మార్కులకు జరగనుండగా 20% మార్కులు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నుంచి కలపనున్నారు. అయితే ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాలు మార్కుల రూపంలో వెల్లడించనున్నారు. గతంలో గ్రేడింగ్ రూపంలో ఇస్తున్న ఫలితాలను ఎత్తివేస్తూ మార్కులను ప్రకటించనున్నట్లు ఇటీవల విద్యాశాఖ జీవో జారీ చేసింది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి పరీక్షా విధానంలోనూ మార్పులను తీసుకురానున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ వాళ్లు సర్కార్ నడుపుతలేరు సర్కస్ నడుపుతున్నారని కేటీఆర్ అన్నారు. ఫార్ములా వన్ ఈ-కార్ రేస్‌పై చర్చ పెట్టడానికి దమ్ములేక రేవంత్ పారిపోతున్నాడని మండిపడ్డారు. రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటలవరకు రేవంత్ పత్తాలు ఆడుతాడంటూ ఆరోపణలు చేశారు.
కారు రేస్ ఇష్యూలో కాంగ్రెస్ ఎంత కక్ష్య చేసినా లీగల్‌గా ఎదుర్కొంటానని కేటీఆర్ అన్నారు. నా మీద కేసు కేసు పెట్టె దమ్ము ఉంది కానీ చర్చ పెట్టె దమ్ము లేదా? రేవంత్ నీ వీరత్వం నాలుగు గోడల మధ్య కాదు.. నాలుగు కోట్ల మంది ప్రజలు చూసేలా సభలో చర్చ పెట్టు దమ్ముంటే అంటూ సవాల్ విసిరారు. రేవంత్‌కు రోజు సాయంత్రం 4గంటల నుంచి 6 గంటలవరకు పత్తాలు ఆడే అలవాటు ఉందని ఆరోపించారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఎవరికి తెలియదు. కాంగ్రెస్ వాళ్లు హౌలగాళ్ళు.. నా రాష్ట్రం దివాళా తీసిందని చెబితే ఎవడైనా పెట్టుబడులు పెడతారా? హైద్రాబాద్ నగరం అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతుంది. అమరావతితో పోటీ పడే పరిస్థితులలో హైద్రాబాద్ లేదు. స్టే ఉన్న ఇళ్లను కూల్చిన విషయంపై బాధ్యత రంగనాథ్ తీసుకుంటాడా అని ప్రశ్నించారు.
ఇక రేవంత్ రెడ్డి స్వయంగా కారు రేస్ పై దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. ఫార్ములా ఈ, ఇతర స్కాములంటూ అసత్యాలను ప్రచారం చేసే కన్న సభలో చర్చ పెడితే నిజాలు తెలుస్తాయి. చర్చ నాలుగు గోడల మద్య కాదు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. లీకు వీరుడు సీఎం ఇచ్చే లీకులే తప్ప నిజాలు అధికారికంగా చెప్పె దమ్ములేదు. ఈ ఫార్ములా రేసులో విషయమే లేనప్పుడు ముందే నేను కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు. న్యాయంగా వ్యవహరించే, ప్రభుత్వ అరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వేంటనే కేసు కొట్టేస్తారనే నమక్మముంది. అధికారికంగా చెప్పే దమ్ములేక క్యాబినెట్ లో నాలుగు గంటల చర్చ అంటూ వార్తలు రాపిస్తున్నారు. కెబినెట్ అంటే గాసిప్ బ్యాచ్ లెక్క తయారైంది. నిజాలు చెప్పే దమ్ము లేఖ సిఎస్ తో నోటీసులు, అనుమతులు అంటూ లీకులిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్ధానిక సంస్ధల చట్టాల సవరణలను వ్యతిరేఖిస్తున్నామన్నారు.
పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమిత్ షా రాజీనామా చేయాలంటూ విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కూడా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను అవమానించిన అతిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. \
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను బీజేపీ అవమానిస్తే బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలి. విపక్ష పార్టీగా సభలో తీర్మానం ప్రవేశపెట్టి అమిత్ షాను భర్తరఫ్ చేయాలని, అరెస్టు చేసి జైల్లో పెట్టాలనే మాట ఎందుకు చెప్పడం లేదు. అమిత్ షాపై తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాయి. అంబేద్కర్‌ను అవమాన పరిచేలా దేవుడిని మొక్కితే ముక్తి దొరుకుతుందని చెప్పడం జాతిని అవమానపరిచ్చినట్టే.
విజయ డెయిరీ నెయ్యి కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చేలా వ్యవహరించకూడదని మంత్రి సూచించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి నెయ్యి సరఫరా టెండర్‌ను ఏపీకి చెందిన ప్రైవేట్ సంస్థ రైతు డెయిరీకి అప్పగించడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తారంటూ అధికారులను మంత్రి ప్రశ్నించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నుంచే నెయ్యి సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్య అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఏపీకి చెందిన రైతు డెయిరీ సంస్థకు నెయ్యి సరఫరా వర్క్ ఆర్డర్ భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి అప్పగించడంపై కొండాసురేఖ మండిపడ్డారు.
జమ్మూకశ్మీర్ కుల్గం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. కుల్గం ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి ఉందని అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో భద్రతా బలగాలు, పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్‌ను ప్రారంభించారు.
జమ్మూకశ్మీర్ కుల్గం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. కుల్గం ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి ఉందని అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో భద్రతా బలగాలు, పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్‌ను ప్రారంభించారు.