భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరును పదే పదే ఉచ్ఛరించడం ఇప్పుడు ఓ ఫ్యాషన్‌గా మారిందంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. అంబేద్కర్‌ను కాదు ఆయనకు బదులుగా దేవుడిని స్మరిస్తే, స్వర్గానికైనా వెళ్లొచ్చంటూ ఉచిత సలహానిచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అంబేద్కర్‌ను అవమానించిన షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. అమిత్ షాపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది.
అసలేం జరిగింది? షా ఏమన్నారు??
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో హోంమంత్రి అమిత్‌షా మాట్లాడుతూ అంబేద్కర్‌ను ఉద్దేశిస్తూ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘అబీ ఏక్ ఫ్యాషన్ హో గయా హై అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్. ఇత్నా నామ్ అగర్ భగవాన్ కా లేతే తో సాత్ జన్మన్ తక్ స్వర్గ్ మిల్ జాతా (అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అంటూ పదే పదే అనడం ఇప్పుడు ఓ ఫ్యాషన్‌గా మారింది. దీనికి బదులుగా దేవుడిని ఇన్నిసార్లు స్మరిస్తే.. స్వర్గానికి వెళ్లొచ్చు)’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. షా వ్యాఖ్యలను విపక్ష నేతలు సహా నెటిజన్లు కూడా ఖండించారు.
అట్టుడికిన పార్లమెంట్
అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌షా వెంటనే క్షమాపణలు చెప్పాలని విపక్షాలు బుధవారం పెద్దయెత్తున నిరసనలు, నినాదాలు చేశాయి. దీంతో రాజ్యసభ అట్టుడికిపోయింది. ఈ క్రమంలో సభ గురువారానికి వాయిదా పడింది. అంబేద్కర్‌ను అవమానిస్తే దేశం సహించబోదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. మనుస్మృతిని అనుసరించే వారికి కచ్చితంగా అంబేద్కర్‌తో చిక్కేనన్న ఆయన షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇండియా కూటమి సభ్యులతో కలిసి పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ ఫొటోలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మూడు రంగుల జెండా, అశోక చక్రానికి బీజేపీ, ఆరెస్సెస్ వ్యతిరేకమన్న విషయాన్ని షా వ్యాఖ్యలు ధ్రువపరుస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. షాను మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. బీజేపీ మిత్రపక్షాలు షా వ్యాఖ్యలతో ఏకీభవిస్తాయా? అని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు. అంబేద్కర్ పేరును బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొంటున్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు. మహాత్మాగాంధీ, నెహ్రూ తర్వాత ఇప్పుడు అంబేద్కర్‌ను బీజేపీ అవమానిస్తున్నదని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ మండిపడ్డారు.
షాపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
అమిత్ షా వ్యాఖ్యలపై టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. అంబేద్కర్ మార్గదర్శకత్వంలో నడిచే లక్షలాది మందికి షా వ్యాఖ్యలు అవమానకరమని బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ ముసుగు తొలిగిపోయిందన్నారు. అంబేద్కర్ దేవుడికంటే ఎంతమాత్రం తక్కువకాదని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అన్నారు. పార్టీ నేతలతో కలిసి ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.