ప్రముఖ తెలుగు నటుడు అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తన తాజా చిత్రం ‘పుష్ప-2: ది రూల్’ ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. దీంతో రేవతి అనే 35 ఏళ్ల మహిళ చనిపోయింది. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీ తేజ ఊపిరాడక ఆసుపత్రిలో చేరగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) సెక్షన్ 105, 118(1) కింద అల్లు అర్జున్, అతని భద్రతా సిబ్బంది, థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2: ది రూల్’ ప్రదర్శనకు అర్జున్ హాజరయ్యారు. సహనటి రష్మిక మందన్నతోపాటు బన్నీ భార్య అల్లు స్నేహా రెడ్డి రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరగగా రేవతి అనే మహిళా మృతి చెందింది. దీంతో సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన ఎం సందీప్, సీనియర్ మేనేజర్ ఎం నాగరాజు, దిగువ బాల్కనీ ఇన్‌ఛార్జ్ గంధకం విజయ్ చందర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.