manatelanganatv.com

పోలీసుల నిర్లక్ష్యం… రెండేళ్ల నరకం… యువకుడి ప్రాణం తీసిన 200 రూపాయలు

 అర్థరాత్రి రెండు వందల రూపాయల కోసం జరిగిన చిన్న గొడవ యువకుడి ప్రాణం తీసిన సంఘటన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రాంతం ఉప్పర్‌పల్లిలో జరిగింది. రెండు సంవత్సరాలు కోమాలో ఉండి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కూడా యువకుడి ప్రాణాలు దక్కలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన అంజయ్య గౌడ్- వెంకటమ్మ దంపతులకు నలుగురు అమ్మాయిలతో పాటు ఒక కుమారుడు వెంకటేష్ గౌడ్ ఉన్నాడు. కుమారుడు డిగ్రీ చదవిన అనంతరం ఎల్‌బి నగర్‌లో ఉంటూ ఎస్‌ఐ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఖాళీ సమయం దొరికినప్పుడు పాకెట్ మనీ కోసం రాత్రి సమయంలో వెంకటేష్ క్యాబ్ నడిపేవాడు. 2022 జులై 31వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో వివేక్ రెడ్డి అనే వ్యక్తి బిఎన్‌రెడ్డి నగర్ నుంచి రాజేంద్రనగర్ మండలం ఉప్పర్‌పల్లికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు.

ఉప్పరపల్లికి చేరుకున్న తరువాత ఛార్జీ రూ.900 అయ్యిందని వెంకటేష్ చెప్పాడు. వివేక్ రెడ్డి ఏడు వందల రూపాయలు అతడి చేతిలో పెట్టి వెళ్తుండగా ఇంకా రెండు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరు గొడవ ప్రారంభమై పెద్దదిగా మారింది. వివేక్ రెడ్డి తన స్నేహితులకు రమ్మని కబురు పంపాడు. వివేక్ రెడ్డి స్నేహితులు అక్కడికి చేరుకొని క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో విచక్షణరహితంగా దాడి చేయడంతో వెంకటేష్ కుప్పకూలిపోయాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొంగతనం చేస్తుండగా పట్టుకున్నామని వివేక్ రెడ్డి, అతడి స్నేహితులు చెప్పడంతో వెంకటేష్ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన యువకుడు మరునాడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చేర్పించిన మరుసటి రోజు అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఒక ఎకరంన్నర పొలం అమ్మి రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. రెండు సంవత్సరాల నుంచి చికిత్స పొందిన అనంతరం ఇవాళ వెంకటేష్ చనిపోయాడు. పోలీసులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించే ఉంటే బతికి ఉండేవాడని తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో పోలీసులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.  2022 ఆగస్టు 8వ తేదీన వార్త పత్రికలు అసలు కథనం రాయడంతో పోలీసులు అప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దాడి చేసిన వారిలో 15 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారంతా కొద్దిరోజులకే బెయిల్‌పై బయటకు వచ్చారు. రెండు వందల రూపాయల కోసం యువకుడి ప్రాణం తీయడంమనేది చాలా దారుణమైన విషయమన్నారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278