manatelanganatv.com

అదానీ ప‌వ‌ర్ ప్లాంట్‌తో తీవ్ర న‌ష్టం

యూపీలోని మీర్జాపూర్‌ అటవీ ప్రాంతం అనేక రకాలైన చెట్లు, ఔషద మొక్కలు, వన్య ప్రాణులకు కేంద్రం. ఈ డివిజన్‌లోని దాద్రీ ఖుర్ద్‌ ప్రాంతంలో.. మీర్జాపూర్‌ థర్మల్‌ ఎనర్జీ(యూపీ) అనే సంస్థ 1,600 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను నిర్మించటానికి పర్యావరణ అనుమతిని పొందే దిశగా మొదటి అడుగులు వేసింది. ఈ కంపెనీ అదానీ గ్రూపునకు కొత్త అనుబంధ సంస్థ. జూన్‌ 28న నిపుణుల అంచనాల కమిటీ ముందు సదరు కంపెనీ సమర్పించిన సమాచారం ప్రకారం.. అక్కడ దాని స్వంత భూమిలో 365.19 హెక్టార్లలో ప్లాంట్‌ను నిర్మించాలని కంపెనీ ప్రతిపాదన. ఈ కమిటీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది. అడవులు, వాతావరణ మార్పు, ప్రతిపాదిత అభివృద్ధి ప్రాజెక్టులకు గ్రీన్‌ క్లియరెన్స్‌పై ప్రభుత్వానికి సలహా ఇస్తుంది.
ఇక్కడున్న 365.19 హెక్టార్లలో.. కంపెనీ దాదాపు 12 హెక్టార్ల అటవీ భూమికి ‘అనుమతులు’ కోరుతున్నది. ఇది ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్న భూమిలో కేవలం 12 హెక్టార్లు మాత్రమే అటవీ భూమి అని చెప్తున్నది. అయితే ఇది తప్పుదోవ పట్టించేలా ఉన్నదని పర్యావరణ నిపుణులు, కార్యకర్తలు అంటున్నారు. ”దాద్రీ ఖుర్ద్‌లోని 665 హెక్టార్ల భూమి ప్రాజెక్ట్‌ సైట్‌ పరిధిలోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ రికార్డులలో ప్రత్యేకంగా 1952 రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో అటవీ ప్రాంతంగా నమోదు చేయబడింది” అని వారు ఎత్తి చూపారు. సుప్రీం కోర్టు 1996 గోదావర్మన్‌ తీర్పు ప్రకారం యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్రభుత్వ రికార్డులో అటవీ ప్రాంతంగా నమోదు చేయబడిన ఏదైనా ప్రాంతాన్ని అటవీ భూమిగా పరిగణించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా నోటిఫై చేయని అటవీ భూమి సర్వసాధారణం. యూపీలో అటవీ శాఖకు కేటాయించిన భూమిలో 27 శాతం ఇంకా అధికారికంగా అటవిగా ప్రకటించాల్సి ఉన్నదని సిన్హా తన లేఖలో పేర్కొన్నారు. ఒక్క మీర్జాపూర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌లోనే రాష్ట్ర రికార్డుల్లో అటవీ భూమిగా వర్గీకరించబడిన 7,300 హెక్టార్లకు పైగా అటవీ భూమిగా ప్రకటించడానికి ఇంకా నోటిఫికేషన్‌ వెలువడలేదు.
ఇదే దాద్రీ ఖుర్ద్‌ స్థలంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ప్రతిపాదించటం ఇది రెండోసారి కావటం గమనార్హం. 2014లో పర్యావరణ మంత్రిత్వ శాఖ అదే స్థలంలో 1,320-మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను నిర్మించటానికి వెల్స్పన్‌ ఎనర్జీకి పర్యావరణ అనుమతిని మంజూరు చేసింది. అయితే, సిన్హా, మరో ఇద్దరు పిటిషనర్లు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్జీటీ)లో కేసు వేశారు. దీనిలో వారు ప్రాజెక్ట్‌ కోసం పర్యావరణ ప్రభావ అంచనాలో ఈ ప్రాంతంలోని అడవులు, వన్యప్రాణుల గురించి తప్పుడు, అసంపూర్ణ సమాచారం ఉన్నదని వాదించారు. 2016లో ఎన్జీటీ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రాజెక్ట్‌ సైట్‌ను దాని ”అసలు స్థితికి” పునరుద్ధరించాలని కంపెనీని ఆదేశించింది.
ప్రస్తుతం, అదానీ గ్రూప్‌తో పాటు రాష్ట్ర రెవెన్యూ, అటవీ శాఖలు సైట్‌ ఫారెస్ట్‌ ల్యాండ్‌ హౌదా గురించి, ప్రాజెక్ట్‌ వల్ల కలిగే నష్టం గురించి స్పందించాల్సి ఉన్నది.

సైట్‌ అడవి ఎలా అంటే..
అటవీ సంరక్షణ చట్టం, 1980లోని అడవుల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు, దానికి సంబంధించిన విషయాలు అన్ని అడవులకు స్పష్టంగా వర్తింపజేయాలని గోదావర్మన్‌ తీర్పు పేర్కొన్నది. ఈ వాదన ప్రకారం.. దాద్రీ ఖుర్ద్‌ అటవీ భూమి అని అనటంలో ఎటువంటి సందేహమూ లేదని నిపుణులు చెప్పారు. ”దాద్రీ ఖుర్ద్‌లో దట్టమైన అడవి ఉన్నది. ఇక్కడ అటవీ శాఖ పని చేస్తున్నది. తోటల పెంపకాన్ని చేస్తూ, వృక్ష-జంతుజాలాన్ని సంరక్షిస్తున్నది” అని ఒక మాజీ అటవీ శాఖాధికారి తెలిపారు. స్లాత్‌ ఎలుగుబంట్ల నివాసానికి మద్దతు ఇచ్చే భారతదేశంలోని కొన్ని ప్రదేశాలలో ఇది కూడా ఒకటన్నారు.అయితే, ఎన్జీటీ గత తీర్పు ఉన్నప్పటికీ.. అదానీ గ్రూప్‌ పర్యావరణ అనుమతులు, అటవీ క్లియరెన్స్‌ను పొందగలదని పర్యావరణ నిపుణులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అదాని పవర్‌ ప్రాజెక్టుతో నష్టం 12 హెక్టార్లు మాత్రమేనని సదరు కంపెనీ పేర్కొంటున్నప్పటికీ.. ఇది 660కి పైగా హెక్టార్ల మొత్తంలో ఉన్న అటవి, జంతు సంపదకు తీవ్ర నష్టాన్ని తీసుకొస్తుందని వారు వాదిస్తున్నారు.

Leave a Comment