ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా అర్వింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డిని ఈ కేసులో నిందితులుగా ఏసీబీ పేర్కొంది. 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెక్షన్ యాక్ట్ కింద కేసులు ఫైల్ చేసిన అధికారులు.. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. 13 (1A), 13(2), 409,120 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదయ్యాయి.
ఈ మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఈడీ ఏసీబీ ఆఫీస్ కేంద్రంగా డైరెక్టర్ నేతృత్వంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(సీఐయూ) ఆధ్వర్యంలో ఈ కేసును దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి అరెస్టుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక విచారణ టైమ్‌లో న్యాయపరమైన చిక్కులు రాకుండా లీగల్ ఒపీనియన్ తీసుకుందని, హైప్రొఫైల్ కేసు కావడంతో వివరాలు రహస్యంగా ఉంచుతున్నట్లు సంబంధిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. నోటీసులు ఇవ్వగానే కేటీఆర్ సహా మిగతా వాళ్లను హెడ్ క్వార్టర్స్‌లోనే ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేసిన ఏసీబీ.. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.