మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జన్మదినం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దేశవ్యాప్తంగా నీటి వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ నీటి కొరతను తీర్చే బృహత్తర కార్యక్రమం ‘నదుల అనుసంధానం’లో భాగమైన కెన్-బెత్వా రివర్ ఇంటర్‌లింకింగ్ ప్రాజెక్టు నిర్మాణం కోసం మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్, వాజ్‌పేయి స్మారకార్థం ప్రత్యేక స్టాంపు, నాణెం విడుదల వంటి కార్యక్రమాలను కూడా మోదీ చేపట్టనున్నారు.
దేశవ్యాప్తంగా నదుల్లో నీటి లభ్యత వినియోగంలో తీవ్ర వ్యత్యాసాలున్నాయి. కొన్ని నదుల్లో నీటి లభ్యత తక్కువ ఉండి, దానిపై ఆధారపడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. కొన్ని నదుల్లో నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే ఏకైక మార్గం నదుల అనుసంధానమేనని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో దీనిపై సమగ్ర అధ్యయనం కూడా చేయించారు. ఆయన కలలుగన్న ఈ ప్రాజెక్టును నిజం చేసేందుకు నేటి ప్రధాని మోదీ నడుం బిగించారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ మధ్యాహ్నం 12:10 గంటలకు ఖజురహో చేరుకుని కెన్-బెత్వా నదుల అనుసంధానం ప్రాజెక్టు శంకుస్థాపనతో పాటు పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం గం. 2:20 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కూడా హాజరుకానున్నారు.