నార్త్ సిటీ మెట్రో విషయంలో ఆశలు చిగురిస్తున్నాయి. విస్తరణ అంశం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉండటంతో… ఇటీవల నార్త్ సిటీ మెట్రో సాధన సమితి చేసిన ప్రయత్నం సఫలమవుతున్నది. ఈ మేరకు విస్తరణపై ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, ఈ క్రమంలో గత కొంత కాలంగా మేడ్చల్ వరకు మెట్రో నిర్మించాలని చేస్తున్న డిమాండ్ సీఎం పరిశీలనలో ఉన్నదని మెట్రో వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే నార్త్ సిటీ ప్రాంతాలు లేకుండానే మెట్రో విస్తరణకు డీపీఆర్ సిద్ధం చేసి, కేంద్ర అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. నార్త్ సిటీకి మెట్రోతో కూడిన డబుల్ డెక్కర్ ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో… సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా శంకుస్థాపన చేసి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఫోర్త్ సిటీ పేరిట నార్త్ సిటీని పరిగణనలోకి తీసుకోకుండానే ప్రతిపాదనలు రూపొందించడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ కొంతకాలంగా ఆ ప్రాంత వాసుల విజ్ఞాపనలను కూడా పరిగణనలోకి తీసుకునేలా చేసిన ప్రయత్నాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
సీఎందే తుది నిర్ణయం..
76 కిలోమీటర్ల మేర ఫేస్-2 మెట్రో విస్తరణకు డీపీఆర్ సిద్ధం చేసింది. ఇందులో నార్త్ సిటీలోని ఏ ఒక్క ప్రాంతానికి చోటు కల్పించలేదు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆ ప్రాంత వాసులు వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. అయితే డబుల్ డెక్కర్ లేకుండానే ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు ఉంటుందనే వాదనలు చర్చకు వచ్చాయి. ఈ సమయంలోనే నార్త్ సిటీ మెట్రో విషయంలో హెచ్‌ఎంఆర్‌ఎల్ ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. ఈ లోపే డీపీఆర్ ఫైనల్ చేయడంతో నార్త్ సిటీకి చోటు దక్కలేదు. కానీ ఫేస్-2లోనే నార్త్ సిటీ ప్రాంతాలను కలిపి మెట్రో నిర్మించేందుకు సీఎం నిర్ణయం కోసం మెట్రో వర్గాలు ఎదురుచూస్తున్నాయి. డబుల్ డెక్కర్ విషయంలో రైట్ ఆఫ్ వేకు ఆస్కారం తక్కువే ఉండటంతో… నార్త్ సిటీ మెట్రోపై పునరాలోచనలు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రక్రియ మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా మెట్రో వర్గాలు పేర్కొన్నాయి.