manatelanganatv.com

అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి.. ఓయూ జేఏసీ ముసుగులో యూత్‌ కాంగ్రెస్‌ నేతల అరాచకం 

 శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి అల్లు అర్జున్‌పై విమర్శలు చేయడం, తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం జరుగుతున్నదని అల్లు అర్జున్‌ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ ఇంటిపై 10మంది యువకులు దాడి చేశారు. ఓయూ జేఏసీ నేతలుగా చెప్పుకుంటూ గేట్లను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. అడ్డుకున్న సిబ్బందిని చితకబాదారు. ఆవరణలోని పూలకుండీలను ధ్వంసం చేశారు. అల్లు అర్జున్‌ ఖబర్దార్‌ అంటూ నినాదాలు చేశారు. అల్లు అర్జున్‌ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చి యువకులను అరెస్ట్‌ చేశారు. అల్లు అరవింద్‌ మేనేజర్‌ కాంతారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన యువకులను చౌటుప్పల్‌కు చెందిన నాగరాజ్‌, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నగేశ్‌, కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన రెడ్డి శ్రీనివాస్‌ , మోహన్‌, చర్లపల్లికి చెందిన ప్రేమ్‌కుమార్‌ , షాద్‌నగర్‌కు చెందిన ప్రకాశ్‌గా పోలీసులు తెలిపారు. దాడి నేపథ్యంలో అల్లు అర్జున్‌ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు, సమీపంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై అల్లు అర్జున్‌ సిబ్బంది దాడి చేశారని యువకులు చెప్పారు.

ఓయూ జేఏసీ నేతలు కాదు: పోలీసులు
దాడికి పాల్పడిన వారు ఓయూ జేఏసీ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు. కానీ వాళ్లు ఓయూ జేఏసీ నేతలు కాదని పోలీసులు స్పష్టంచేశారు. దాడిలో కీలకపాత్ర పోషించిన రెడ్డి శ్రీనివాస్‌ కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గుర్తించారు. 2019లో కాంగ్రెస్‌ నుంచి జడ్పీటీసీగా కూడా పోటీ చేశాడని, అతడు సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తుంటాడని తెలుస్తున్నది. మిగిలిన యువకులు కూడా కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పని చేస్తున్నారని సమాచారం. మరోవైపు దాడిలో పాల్గొన్న రెడ్డి శ్రీనివాస్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. మళ్లీ 1500మందితో వచ్చి దాడి చేస్తామని ఆ వీడియోలో హెచ్చరించాడు.

ఇళ్లపై దాడిని సహించం: సీఎం రేవంత్‌రెడ్డి
సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని సహించబోమని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అల్లు అర్జున్‌ ఇంటిపై దాడిని ఖండిస్తూ సీఎంవో నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా డీజీపీ, నగర సీపీని ఆదేశించారు. సంధ్య థియేటర్‌ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278