తెలంగాణ మాజీ మంత్రిపై టీటీడీ చర్యలకు సిద్ధమవుతుందా?.. త్వరలోనే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?.. అంటే అవును అనే అంటున్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు..ఈ మేరకు ఆయన ఈ విషయం గురించి ట్వీట్ చేశారు. తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా ఊరుకునేది లేదన్నారు.
తిరుమల పవిత్ర క్షేత్రమని.. ఇది రాజకీయ వేదిక కాదన్నారు. ఎవరూ రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే టీటీడీ పాలకమండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటివారైనా సరే ఊరుకోమన్నారు.
తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నామన్నారు. అయితే ఆయనపై కేసు నమోదు చేస్తారా?.. టీటీడీ నిబంధనల ప్రకారం ఏవైనా చర్యలు తీసుకుంటారా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.