ఫార్ములా-ఈ కేసు విషయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో రెండు రోజుల్లో ఏసీబీ నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌తో పాటు మరికొందరిపై కూడా ఏసీబీ కేసు నమోదు చేయనుంది. అయితే విచారణ సమయంలో న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నటారట. ఇదే కనుక జరిగితే ఇంకో రెండు రోజుల్లో కేటీఆర్‌కు నోటీసులు వెళ్లడం పక్కా అని తెలుస్తోంది.
ఇటీవల సీఎస్ శాంతకుమారి కూడా ఈ కేసును టేకప్ చేయాలని ఎసీబీకి లేఖ రాశారు. దీనికి గవర్నర్ ఇచ్చిన అనుమతిని జోడించి.. రేస్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం ఎలా జరిగింది? ఎవరు చేశారనే విషయాలపై దర్యాప్తు చేయాలని శాంతకుమారి ఏసీబీని కోరారు. ఆర్‌బీ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడం, ముందు డబ్బులు ఇవ్వడం ఆ తర్వాత ఒప్పందం చేసుకోవడం నేరమని ఆమె లేఖలో తెలిపారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన పార్ములా-ఈ కార్ విషయంలో నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్‌పై ఆరోపణలు వచ్చాయి. హెచ్‌ఎండీఏ అనుమతి లేకుండా ఈ కారు సంస్థకు రూ. 46 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారు. దీంతో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, చీఫ్ ఇంజినీరుతో పాటు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతివ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. అయితే కేటీఆర్ చేయమన్నారని ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ చెప్పడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.