హెచ్ఎండీఏ ఆదాయ మార్గాలను మరిచింది.బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్డు, లేక్ ఫ్రంట్ పార్క్, బోటింగ్, ఎన్టీఆర్ గార్డెన్, అంబేద్కర్ స్టాచ్యూ, లుంబినీ పార్క్, ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా హెచ్ఎండీఏకు ఆదాయం తీసుకువచ్చే వేదికలే. కానీ గడిచిన ఏడాది కాలంగా ఈ ప్రాంతంలో జరిగే నిర్మాణ పనులు, మరమ్మతుల కారణంగా లీజింగ్ జరగడం లేదు. దీంతో ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. గతంలో సినిమా షూటింగ్‌లు, సమావేశాలు, గెట్ టు గెదర్ మీటింగ్‌లు, ఈవెంట్ల పేరిట ఎప్పుడూ బుకింగ్ నిండిపోయి ఉండేవి. కానీ ఇటీవల కాలంగా బీపీపీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బుకింగ్స్ రావడం లేదని తెలిసింది.
ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఆన్లైన్లోనే అనుమతులు పొందే అవకాశాన్ని బీపీపీ ఏర్పాటు చేసింది. ఇందులో తేదీల వారీగా, ట్యాంక్ బండ్ నుంచి లేక్ ఫ్రంట్ పార్క్ వరకు అన్ని వేదికలు ఆన్లైన్లో కనిపిస్తాయి. కానీ వచ్చే 15 రోజుల వరకు ఏ ఒక్క వేదికలో కూడా బుకింగ్స్ జరగలేదని తేలింది. దీనికి ప్రధాన కారణం గతంలో కంటే అధ్వానంగా నిర్వహణ ఉండటంతోనేనని, వినియోగదారులకు అనువైన మౌలిక వసతులు లేకపోవడంతోనే బీపీపీ పరిధిలో ఉన్న ఈవెంట్ వేదికలకు ఆదరణ రావడం లేదని తెలుస్తున్నది.
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్యాంక్ బండ్‌పై కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలు ఉండగా… ఒక్కో కార్యక్రమానికి రూ. 10వేల నుంచి లక్ష వరకు చార్జీల రూపంలో హెచ్ఎండీఏకు వస్తుంది. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అదనపు ఆదాయాన్ని హెచ్ఎండీఏ కోల్పోతున్నది. డిసెంబర్ 31 వరకు వేదికలన్నీ కూడా ఖాళీగానే ఉండగా… బుకింగ్స్‌ను ఆకర్షించడంలో అధిక ధరలు కూడా కారణమని, మరమ్మతుల పేరిట ఏటా టెండర్ల వ్యవహారం నడిపిస్తున్నారే తప్ప.. కనీస మౌలిక వసతులు ఆయా వేదికల్లో ఉండటం లేదని కొందరు గతంలో బుకింగ్ చేసుకున్న ఈవెంట్ ఆర్గనైజర్లు తెలిపారు. అంతకంటే తక్కువ ఖర్చుతో నగరంలో ఎన్నో వేదికలు అందుబాటులో ఉన్నాయంటున్నారు.