బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టి ప్రతి నెల గ్రామాలకు 275 కోట్లు, పట్టణాలకు 150 కోట్లు ఇచ్చాం. కానీ కాంగ్రెస్‌ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె, పట్టణ ప్రగతి కింద ఒక్క రూపాయి కూడా గ్రామపంచాయతీలకు ఇవ్వడం లేదని విమర్శించారు. గ్రామపంచాయతీలను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేయడంతో తెలంగాణ పల్లెలకు పోతే చికన్ గున్యా వంటి వ్యాధులు వస్తాయని అమెరికా తన పౌరులను హెచ్చరించే స్థాయికి పరిస్థితి వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనినిబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు తెలిసిపోతున్నదని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా సర్పంచులకు పెండింగ్ బిల్లులపై హరీశ్‌రావు ప్రశ్నలేవనెత్తారు. దీనికిగాను మంత్రి సీతక్క సర్పంచ్‌లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.691 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. దీనిపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు, కానీ చిన్న కాంట్రాక్టర్లకు సంవత్సరకాలం నుంచి 691 కోట్లు నిధులు ఇవ్వకుండా సర్పంచులు, ఎంపీటీసీలను ప్రభుత్వం గోస పెడుతున్నదని విమర్శించారు. చివరికి వారు గవర్నర్, మంత్రులను కలిసి మొరపెట్టుకున్నారని అయినా లాభం లేదని చలో అసెంబ్లీకి పిలుపునిస్తే వారిని అరెస్టు చేస్తున్నారని చెప్పారు.
0