బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి లో చేర్పించారు. న్యూరాలజీ విభాగం వైద్యులు ఆయనను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఆయన అస్వస్థతతో ఆసుపత్రిలో చేరడం ఏడాదిలో ఇది నాలుగోసారి.
ప్రస్తుతం అద్వానీ వయసు 96 ఏళ్లు. ఆయన గత కొంతకాలంగా వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు నెలల్లో పలుమార్లు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తొలుత జూన్ 26న అద్వానీ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. జులై 3న మరోసారి ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఆయన్ని ఎయిమ్స్కి తరలించారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆగస్టు 6వ తేదీన మరోసారి ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం ఇంటికి చేరారు. ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురయ్యారు.