manatelanganatv.com

గ్రూప్‌ 2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ.. పరీక్షలు యథాతథం

తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్షలు మరో నాలుగు రోజుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. అయితే గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని సోమవారం విచారించిన హైకోర్టు వాయిదాను తిరస్కరించింది. డిసెంబరు 15, 16 తేదీల్లో జరగనున్న పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాగా డిసెంబరు 16న రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) పరీక్షలున్నందున గ్రూప్‌ 2ను వాయిదా వేయాలని కోరుతూ టీజీపీఎస్సీకి ఇచ్చిన వినతిపత్రంపై స్పందించకపోవడాన్ని సవాలు చేస్తూ ఆర్‌.జ్యోతి అనే అభ్యర్ధితోపాటు వివిధ జిల్లాలకు చెందిన సుమారు 22 మంది అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ ఇరు పక్షాల వాదనలు విన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ డిసెంబర్‌ 16న గ్రూప్‌ 2 కి సంబంధించి పేపర్ 3, 4 పరీక్షలు ఉన్నాయని, అదేరోజు ఆర్‌ఆర్‌బీ పరీక్ష కూడా ఉందని అన్నారు. రెండింటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఒక పరీక్ష రాస్తే మరో పరీక్షను కోల్పోవల్సి వస్తుందని, అందువల్ల గ్రూప్‌ 2 పరీక్షలను రీషెడ్యూల్‌ చేయమని కోరుతూ టీజీపీఎస్సీకి నవంబరు 25న వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు.

ఇక మరోవైపు టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది రాజశేఖర్‌ వాదనలు వినిపిస్తూ.. 783 పోస్టులకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని, ఇప్పటికే హాల్‌టికెట్లు కూడా డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయన్నారు. కేవలం 22 మంది కోసం పరీక్ష వాయిదా వేస్తే కొందరికే ప్రయోజనం ఉంటుందని, మిగతా లక్షల మంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పరీక్ష ఏర్పాట్లన్నీ పూర్తయినందున.. ఈ స్థాయిలో పరీక్షలు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

కాగా తెలంగాణలో గ్రూప్‌ 2 పరీక్షల హాల్‌ టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో జరగనున్న ఈ పరీక్షల హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అందుబాటులోకి లింక్‌ తీసుకు వచ్చింది. మొత్తం 4 పేపర్లకు ఈ పరీక్షలు ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా పరీక్షకు హాజరుకానున్నారు. ఇతర సమాచారం కోసం టీజీపీఎస్సీ హెల్ప్‌లైన్‌ నంబర్లు 040-22445566/ 23542185/23542187ను సంప్రదించవచ్చు. లేదా helpdesk@tspsc.gov.inకు ఈ మెయిల్‌ చేయవచ్చు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278