పుట్టిన గడ్డను మాతృసమానంగా చూసే సంస్కృతి మనది. అది ఊరు, రాష్ట్రం, దేశం ఏదైనా తల్లిగా భావిస్తాం. మొత్తం భూమండలాన్నే భూదేవత అని కొలుస్తాం. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పిస్తాం. ప్రేమ గల్ల తల్లి కోసం త్యాగాలకు వెనుకాడం. అటువంటి తల్లికి రూపం ఇచ్చి పూజించుకోవడం కొత్తకాదు. అనాదిగా వస్తున్న సంప్రదాయమే. స్వాతంత్య్రానంతరం భారతమాతకు ఎందరో మహానుభావులు మేధస్సును రంగరించి భారతమాత రూపమిచ్చారు. చేతులకు గాజులు, మెడలో ఆభరణాలు, తలపై కిరీటంతో భారతమాతను దేవతామూర్తిగా సకల సౌభాగ్యాలతో తయారు చేశారు.
ధీరత్వానికి, వీరత్వానికి ప్రతీకగా దుర్గామాత రూపంలో భారతమాతను పూజిస్తుంటాం. భారతమాతకు జై అనే నినాదం వినిపించినా, ఆలపించినా ఉద్వేగానికి గురవుతాం. భారతమాత విగ్రహానికి భారతదేశం సుసంపన్నమైన దేశంగా, వీరత్వంతో, ధీరత్వంతో ప్రపంచంలో వెలుగొందాలనేది విగ్రహ రూపకర్తలైన మహనీయుల ఉద్దేశం. ఇలా దేశంలోని ఏ రాష్ట్రమాత విగ్రహం చూసినా దేవతా మూర్తిగానే దర్శనమిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా ఏ రాష్ట్రమాతను చూసినా వైభవం ఉట్టిపడేలా ఉంటుంది. కానీ అద్భుతంగా విలసిల్లిన తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో కొత్త విగ్రహం ప్రతిష్ఠించడం, ఆ ప్రతిమ దీనస్థితిని ప్రతిబింబించేలా ఉన్నదంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.