రాష్ట్రంలో గురుకుల, సంక్షేమ పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయి. ప్రభుత్వ అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో ఏడాదిలోనే గురుకులాల పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వంలో సంబంధిత శాఖలకు మంత్రి లేకపోవడంతో కొందరు అధికారులు ఆడింది ఆటగా నిర్వహణ సాగుతున్నది. అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆగం చేస్తున్నాయి. అడ్డగోలు విధానాలతో గందరగోళంగా మారిన గురుకులాల్లో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే దుస్థితి నెలకొన్నది. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడగా మరికొందరు ఆహారం కలుషితమై మృతి చెందారు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ గురుకుల వసతి గృహంలో ఏ వార్త వినాల్సి వస్తుందో అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పేదలకు మెరుగైన విద్య అందించాల్సిన పాఠశాలలు విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్నాయి.
బీఆర్‌ఎస్ హయాంలో గురుకుల విద్యాలయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో గురుకులాల్లో విద్యాబోధన చేసింది. తెలంగాణ గురుకులాలు దేశానికి దిక్సూచిగా మారాయి. పిల్లలను గురుకుల, సంక్షేమ పాఠశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రులు పోటీపడ్డారు. కానీ కాంగ్రెస్ ఏడాది పాలనలో గురుకులాలు గాడితప్పాయి. అన్నమో రామచంద్రా అంటూ విద్యార్థులు రోడ్డెక్కితే.. మీకు తిండి పెట్టేందుకు ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వలేదుఅని అధికారులు చిన్నారులను చీత్కరించుకున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. సాంఘిక సంక్షేమ, మైనారిటీ, గిరిజన సంక్షేమశాఖలకు ప్రత్యేకంగా మంత్రి కూడా లేరంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ శాఖలన్నీ సీఎం రేవంత్‌రెడ్డి వద్దనే ఉండటం, పర్యవేక్షణ లేకపోవడం, విధాన నిర్ణయాల్లో ఆలస్యంతో సమస్యలు నెలకొన్నాయి. బీసీ సంక్షేమ గురుకులాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నా తాను పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
గురుకులాలు, సంక్షేమ పాఠశాలల్లో కలుషితాహారంతో విద్యార్థుల మృతి, ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలకు సంబంధితశాఖ పర్యవేక్షణ లేకపోవడమే కారణమని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్లు నాణ్యతలేని సరుకులు సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల్లో పని వేళలను మార్చడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్తున్నారు. బోధనకు సంబంధం లేని పనుల బాధ్యతలను తమకు అప్పగించడంపై టీచింగ్‌పై ఏకాగ్రత పెట్టలేకపోతున్నామని ఉపాధ్యాయులు చెప్తున్నారు. విద్యార్థులతో పాటు తాము కూడా ఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు.