సూర్యాపేట జిల్లా పర్యటనలో రైతులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నోరు పారేసుకున్నారు. డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలే తప్ప.. అడుక్కుతినే బతుకు వద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా, రుణమాఫీపై అదిగో.. ఇదిగో.. అంటూ కాలం వెళ్లదీస్తూ అడ్డగోలుగా మాట్లాడడంపై రైతులు మండిపడుతున్నారు. కోదాడ మండలం కాపగల్లు గ్రామంలో రోడ్డు పనుల శంకుస్థాపనలో మంత్రులు ఉత్తమ్, పొన్నం, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి తుమ్మల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘రైతులు డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలి. అంతేగానీ, పొద్దాక నాకు రైతుబంధు రాలేదు.. రైతు బీమా రాలేదు.. రుణమాఫీ కాలేదు.. అని అడుక్కుతినే బతుకు మనకు అవసరం లేదు. వ్యవసాయదారులది ఎప్పుడూ దానం చేసే గుణమే తప్ప, ఈ జాతికి అడుక్కునే అవసరాలు లేవు’ అంటూ అడ్డగోలుగా మాట్లాడారు. మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై గ్రామ రైతుల భగ్గుమంటున్నారు.