గత వారం రోజులుగా దడ పెట్టిస్తున్న ఫెంగల్ తుపాను ఎట్టకేలకు శాంతించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వద్ద తీరం దాటింది. అయినా దీని ప్రభావం 6 గంటలకు పైగా భీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరి సమీపంలోని కడలూరుకు 30 కిలోమీటర్లు, విల్లుపురానికి 40 కిలోమీటర్లు, చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం రాత్రికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత అల్పపీడనంగా మారి నిర్వీర్యం అవుతుందని వాతావరణ శాఖ వివరించింది.
ఫెంగల్ తుపాను ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. చిత్తూరు, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. గడచిన 24 గంటల్లో తిరుపతి జిల్లా పుత్తూరులో అత్యధికంగా 18.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని రాచలపాలెంలో 15.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంలో తిరుపతి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇక్కడ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. సత్యవేడు, గూడూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరుపతిలో మామిడి కాలువ, పాముల కాలువ, కార్వేటి కాలువ, ఈదులకాలువ, సున్నపు కాలువలతో సహా 21 కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షం ప్రభావంతో 116 ఆర్టీసీ సర్వీసులు, గ్రామీణ ప్రాంతాలకు 21 ఆర్టీసీ సర్వీసులు నిలుపుదల చేశారు. మరోవైపు చెన్నైలో ఇంకా తీవ్రంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల నుంచి చెన్నైకి వెళ్లే పలు బస్సులను రద్దు చేశారు. ఇక సోమవారం కూడా రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
కృష్ణా జిల్లాలో ఆదివారం కూడా వర్షాలు కురిశాయి. 19,500 ఎకరాల్లో వరి నీటపాలైంది. కోతలు పూర్తయిన చోట్ల ధాన్యాన్ని రోడ్లపై రాశులు పోయగా.. అదీ తడిసిపోయింది. పలు జిల్లాల్లో కంది, మిరప వంటి పంటలు పూత దశలో ఉండటంతో గాలులకు రాలిపోయింది. అకాల వర్షాల వల్ల పంటలు తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కోతకు వచ్చిన వరి, రాగి, మొక్కజొన్న పంటలు వానలకు దెబ్బ తిన్నాయి. శ్రీకాకుళంలో చెదురుమదురు జల్లులు పడ్డాయి. తిరుమలలోని రెండో ఘాట్ రోడ్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. సకాలంలో టీటీడీ సిబ్బంది స్పందించి వాటిని తొలగించింది. ఘాట్ రోడ్లపై దట్టమైన పొగమంచు కమ్మడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వర్షానికి తోడు చలి తీవ్రత పెరగడంతో జనాలు నానాపాట్లు పడుతున్నారు.