manatelanganatv.com

సంక్రాంతి తర్వాత రైతు భరోసా

సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామనీ, త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా విధివిధానాలపై చర్చిస్తామని తెలిపారు. రైతు రుణమాఫీని పూర్తిచేసినట్టే, రైతు భరోసా హామీని కూడా అమలు చేస్తామని స్పష్టంచేశారు. పాలమూరులో జరిగిన రైతు పండుగలో వేలాది మంది రైతులు పాల్గొని ప్రభుత్వానికి ఆశ్వీరాదం ఇచ్చారని చెప్పారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాపై మారీచ, సుబాహులు (బీజేపీ, బీఆర్‌ఎస్‌) చెప్పే రాక్షస మాటలు విని ఆగం కావొద్దని రైతాంగానికి హితవు చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా సొమ్మును ఖాతాల్లో వేస్తామనీ, ఇందిరమ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారెంటీ అమలై తీరుతుందనీ, ఆ బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని స్పష్టం చేశారు. వాస్తవాల ప్రాతిపదికగా తమ ప్రభుత్వం భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో, రూ.69 వేల కోట్ల అప్పులతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలన తర్వాత, మాజీ సీఎం కేసీఆర్‌ నుంచి తిరిగి కాంగ్రెస్‌ అధికారం చేపట్టేనాటికి రూ.7 లక్షల కోట్ల అప్పుతో మా చేతికోచ్చిందని వివరించారు. ఈ అప్పుకు ప్రతినెలా దాదాపు రూ.6,500 కోట్లను కేవలం వడ్డీలుగా చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందని అప్పటి సీఎం కేసీఆర్‌, ఆర్థికమంత్రులు టీ హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లు ఏనాడూ ప్రజలకు చెప్పకపోగా, బంగారు తెలంగాణ సృష్టిస్తున్నామని అబద్ధాలు చెప్పారని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏనాడూ ప్రజాసంక్షేమాన్ని విస్మరించలేదనీ, దాన్ని కొనసాగిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నదని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌ బకాయి పెట్టిన రూ.7,625 కోట్ల రైతుబంధు సొమ్మును తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించామని గుర్తుచేశారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్‌, సబ్సిడీ ఎరువులు, మద్దతు ధర, ఉపాధి హామీ పథకం లాంటి వాటితో రైతులను ఆదుకుంటున్నామన్నారు. కేవలం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు రుణమాఫీ చేశామనీ, మహబూబ్‌నగర్‌లో రూ.2,747 కోట్ల రుణమాఫీని నాలుగో విడతలో ఇచ్చామని చెప్పారు. మొత్తంగా 25,35,964 మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణమాఫీ పూర్తి చేశామని వివరించారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 29 రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత తక్కువ సమయంలో రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర లేదనీ, ఆ రికార్డు కేవలం తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికే చెందుతుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కేవలం రూ.3,331 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందనీ, నాలుగున్నరేండ్లు రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీ కింద రైతులు రూ.8,578.97 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. మారీచ, సుబాహులు (బీజేపీ, బీఆర్‌ఎస్‌) సన్న వడ్లకు రూ.500 బోనస్‌పై అపోహలు సృష్టించారని విమర్శించారు. సన్న వడ్లు పండిస్తే, బోనస్‌ ఇస్తామని తాము చెప్తుంటే, దాన్ని వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 31 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించిందని తెలిపారు. వచ్చే సీజన్‌లో కూడా రూ.500 బోనస్‌ కొనసాగుతుందని తేల్చిచెప్పారు. తెలంగాణ సోనా, బీపీటీ,హెచ్‌ఎమ్‌టీ వంటి వంగడాలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందనీ, తెలంగాణ ప్రజలు ఇదే బియ్యాన్ని ఎక్కువగా తింటారన్నారు. ఇక్కడి భూముల్లో పండే ధాన్యాన్నే పేదలకు రేషన్‌ దుకాణాల్లో ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యంతోనే భోజనం పెడతామన్నారు. రైతు రుణమాఫీపై అనవసర అనుమానాలు వద్దనీ, రేషన్‌కార్డు లేని వారికి కూడా రుణమాఫీ అయ్యిందని వివరించారు.
గుజరాత్‌లో మద్యనిషేధం ఉందని బీజేపీ చెబుతున్నదనీ, అక్కడ ఏ బ్రాండ్‌లు దొరుకుతాయో తీసుకెళ్లి చూపిస్తామని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణతో ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆయన గుజరా తీయుల గులాం అని ఇప్పటికే తాను చెప్పానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు, వారి ఎన్నికల మ్యానిఫెస్టోలపై చర్చించేందుకు తన ప్రభుత్వంలోని మంత్రులు సిద్ధంగా ఉన్నారంటూ మరో ప్రశ్నకు స్పందించారు

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278