పాలమూరు గడ్డ రైతుల వేదిక అన్నారు. ప్రజాప్రభుత్వం 54వేల కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టిందని అన్నారు. రైతుపండగకు ఏర్పాట్లు చేసిన అధికారులకు అభినందనలు తెలియజేశారు. నవంబర్ 30కి దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఉందని చెప్పారు. 2023 నవంబర్ 30న రాష్ట్రంలో మార్పు కోరుకుంటూ దొరల గడీలను కూల్చడానికి ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారన్నారు. పాలమూరు బిడ్డగా రైతుల కష్టాలు ఎన్నో చూశానని, వలసలు పోతున్న బస్సులను చూసి ఆవేదన వ్యక్తం చేశానని చెప్పారు.
వనపర్తిలో చదువుకుంటున్నప్పుడే ఏదో ఒకరోజు పాలమూరు బిడ్డకు అవకాశం వస్తుందని అనుకున్నట్టు చెప్పారు. బూర్గుల రామకృష్ణారావు తరవాత సరిగ్గా 70 సంవత్సరాల తరవాత మీ బిడ్డ కొండారెడ్డిపల్లి నుండి బయలుదేరి తెలంగాణ సీఎం అయ్యాడని అన్నారు. అనవసరమైన ఖర్చులు పెట్టడానికి ఈ అవకాశం రాలేదని అన్నారు. భట్టి విక్రమార్క సహా పార్టీలోని సీనియర్ నాయకులు పాలమూరు జిల్లా బిడ్డకు అవకాశం ఇవ్వాలని తనకు అవకాశం ఇచ్చారని అన్నారు.
వాళ్లందిరికీ పాలమూరు బిడ్డలు రుణపడి ఉంటారని చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏం చేశారో నా కంటే మీకే ఎక్కువ తెలుసు అని అన్నారు. కేసీఆర్ అప్పుడు వరి వేసుకుంటే ఉరే అని అన్నాడని విమర్శించారు. కానీ తాము వరి వేసుకుంటే రూ.500 బోనస్ ఇస్తున్నామని, ఆ పైసలు రైతుల ఖాతాల్లో పడుతుంటే బీఆర్ఎస్ నాయకుల గుండెలు అదురుతున్నాయని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కట్టిన అన్నడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల చేపట్టిన అన్నాడు.
కేవలం సాగునీటి ప్రాజెక్టుల కోసం లక్షా ఎనభైమూడు వేల కోట్లు ఖర్చు పెట్టాడన్నారు. కాళేశ్వరానికే లక్షా రెండువేల కోట్లు ఖర్చు చేశారన్నారు. అన్ని కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టులు కుప్పకూలిపోయి చుక్కనీరు లిఫ్ట్ చేయకపోయినా కాంగ్రెస్ హయాంలో కట్టిన మంజీర, కోయిలసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లిలాంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి ఈ సంవత్సరం లేకపోయినా 1 కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించామని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఈ స్థాయిలో ఎవరూ పండించలేదని చెప్పారు.
పాలమూరును అభివృద్ది చేస్తుంటే కేసీఆర్ కుటుంబం అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు కట్టాలన్నా, కంపెనీలు తీసుకురావాలన్నా వాళ్లు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. లగచర్లలో చిచ్చు పెట్టింది వాళ్లే అని చెప్పారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దని లగచర్ల రైతులకు సూచించారు. నమ్మితే నష్టపోయేది మనమే అని చెప్పారు. కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టాలని అన్నారు. వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు
కేసీఆర్ ఉన్నప్పుడు మన జిల్లాలకు ఇంతమంది మంత్రులు ఎప్పుడైనా వచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఎప్పుడైనా అన్నా అని పిలిచారా.. ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదని అన్నారు. లగచర్ల రైతులకు కావాలంటే ఎకరానికి రూ.20లక్షలు కూడా ఇస్తామని కంపెనీలు వస్తే ఉపాధి వస్తుందని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు అల్లుడని, మన ఆడబిడ్డనే ఆయన పెళ్లి చేసుకున్నారని అన్నారు.
మహబూబ్ నగర్ కు ఏడాదికి రూ. 20 వేల కోట్లు ఇవ్వాలని మంత్రివర్గాన్ని సభా వేదికగా కోరారు. మహబూబ్ నగర్ వలస జీవితాలు బాగుపడాలంటే, ఏడాదికి రూ. 20 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. 70 ఏండ్లు తమకు అన్యాయం జరిగిందని చెప్పారు.