‘కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని బీఆర్‌ఎస్ నాయకులు అబద్ధాలు చెబుతున్నారు. కానీ కేసీఆర్ చేపట్టింది దొంగ దీక్ష. ఆ దీక్ష వల్ల తెలంగాణ రాలే.. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్న సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు” అని రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆయన నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం పర్యటించారు. డిచ్‌పల్లి, ధర్పల్లిలో రోడ్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. అంతకుముందు ధర్పల్లిలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. తెలంగాణ కోసం కోట్లాది మంది ప్రజలు ఉద్యమించారని, వేల మంది యువకులు బలిదానాలు చేసుకున్నట్టు తెలిపారు. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య ఇలా ఎందరో ప్రాణ త్యాగాలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పదువులను తృణప్రాయంగా వదిలి సోనియాకు తెలంగాణ ఆకాంక్షపై వివరించామని, దీంతోనే సోనియమ్మ చలించి తెలంగాణ ఇచ్చారని తెలిపారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని నేడు బావ, బామ్మర్దులు పిచ్చి కుక్కల్లా ప్రతిరోజూ తిట్ల పురాణం మొదలు పెట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.
0