manatelanganatv.com

పెట్టుబడుల కటకట.. కాంగ్రెస్‌ పాలనలో మసకబారుతున్న తెలంగాణ ఖ్యాతి

పెట్టుబడుల సాధనలో గడచిన పదేండ్లలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంటూ మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఖ్యాతి మసకబారుతున్నది. రియల్‌ ఎస్టేట్‌, పారిశ్రామికాభివృద్ధి, నైపుణ్య అవకాశాలు, సులభతర వాణిజ్యం వంటి సూచీల్లో ఇప్పటికే గత వైభవాన్ని కోల్పోయిన తెలంగాణ.. పెట్టుబడులకు సంబంధించిన సూచీలోనూ టాప్‌-8 రాష్ర్టాల జాబితాలో అట్టడుగున నిలవడం ఆందోళన కలిగిస్తున్నది.

2024-25లో తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) దేశవ్యాప్తంగా 5,127 ప్రధాన ప్రాజెక్టుల ద్వారా వివిధ రాష్ర్టాల్లో రూ. 15,67,374.91 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. ఇందులో దాదాపు 25% ప్రాజెక్టులు, మరో 25% పెట్టుబడులు మహారాష్ట్రకే తరలివెళ్లాయి. ఏడాది క్రితం వరకు పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచిన తెలంగాణలో ఈ ఆరు నెలల్లో 212 ప్రాజెక్టులే వచ్చాయి. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం ప్రాజెక్టుల్లో ఇది కేవలం 4.13 శాతమే. ఆరు నెలల్లో కేవలం రూ. 56,515.97 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. ఇది 3.60 శాతంతో సమానం. వెరసి ఈ జాబితాలో తెలంగాణ 8వ స్థానానికి పరిమితమైంది. పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల కల్పనలో కొన్ని నెలల క్రితం వరకు గడ్డు పరిస్థితిలో ఉన్న ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ర్టాలు తెలంగాణను దాటుకుని జాబితాలో మెరుగైన ర్యాంకును సాధించాయి.

కాంగ్రెస్‌ సర్కారు ప్రతికూల నిర్ణయాలు
సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే పెట్టుబడులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి పారిశ్రామిక వర్గాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం షాకిచ్చింది. దాదాపు అన్ని అనుమతులు వచ్చి.. పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న 16 వేల ఎకరాల ఫార్మా సిటీని రద్దు చేయడమేంటని అప్పుడే పారిశ్రామికవర్గాలు ఆశ్చర్యంవ్యక్తం చేశాయి. అనంతరం హైడ్రా పేరిట కూల్చివేతలు చేపట్టడం రియల్‌ఎస్టేట్‌ రంగాన్ని కుదేలు చేసింది. ఇది కూడా కొత్త పెట్టుబడులకు ప్రతిబంధకంగా మారింది. ఇక ఎంఎస్‌ఎంఈ లకు కొత్త విధానాన్ని తెస్తామంటూ 8 నెలలు కాలయాపన చేసిన సర్కారు తీరిగ్గా గత నెలలో పాలసీని ప్రకటించింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవసరమైన సులభతర వాణిజ్యానికి ఈ పాలసీ అంతగా మేలు చేసేలా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278