- వెబ్‌సైట్‌లో కనిపించేవి 8 మాత్రమే
- ప్రతిపక్షంలో ఉండగా జీవోలన్నీ వెబ్‌సైట్‌లో పెట్టాలని డిమాండ్
- నేడు ఆచరణలో మాత్రం శూన్యం
మున్సిపల్ శాఖలో ఏం జరుగుతున్నది? అంటే అంతా రహస్య జీవోల తతంగం నడుస్తున్నది అని అర్థమవుతున్నది. ఎందుకలా అంటే.. ఆ శాఖలో ఇప్పటి వరకు మొత్తం 390 జీవోలు విడుదల కాగా, అందులో కేవలం 8 మాత్రమే అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అంటే.. రెండు శాతం జీవోలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నమాట. మిగిలిన 98 శాతం జీవోలు రహస్యంగా ఉంచారు. దీనిపై సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. ఏ సంస్థలకు ఎలాంటి మినహాయింపులు, రాయితీలు, సబ్సిడీలు, విధానపరమైన నిర్ణయాల్లో ఎవరెవరికి లబ్ధి చేకూర్చారోనని, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు ప్రజలకు తెలుసుకోవడానికి అవకాశం లేకుండా రహస్యాన్ని పాటిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా.. జీవోలన్నీ వెబ్‌సైట్‌లో పెట్టాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ ముఖ్యనేతలే ఇప్పుడు జీవోలను రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అత్యంత కీలకమైన మున్సిపల్‌శాఖలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, ఓఆర్‌ఆర్, మూసీ నది, మెట్రో రైలు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్, డీటీసీపీ, సీడీఎంఏ భాగం.
అలాంటి శాఖలో జీవోలను రహస్యంగా ఉంచటం అనేక అనుమానాలకు తావిస్తున్నది. సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు తెలుసుకొనే హక్కు ప్రజలకు ఉన్నదని స్పష్టం చేస్తున్నారు. ‘పంచాయతీరాజ్ శాఖలోనూ గత జనవరి నుంచి మొత్తం 480 జీవోలు జారీఅయ్యాయి. ఈ శాఖ వెబ్‌సైట్‌లో 26 జీవోలను మాత్రమే పొందుపరిచారు. మిగిలినవన్నీ రహస్యంగానే ఉన్నాయి. ఈ రెండు శాఖల్లోనే కాకుండా దాదాపు ప్రతి శాఖలో ఇదే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా జీవోలన్నింటనీ బహిర్గతం చేయాలి. అందరికీ అందుబాటులో ఉండేలా వెబ్‌సైట్‌లో ఉంచాలి’ అని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న కీలకమైన జీవోలన్నీ రహస్యంగా ఉంచుతున్నారని.. అందుకు మాజీ ఐపీఎస్ అంజనేయరెడ్డి నియామకమే ఉదాహరణ అని పేర్కొంటున్నారు.