సీఎం రేవంత్‌రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడటమే తప్ప ప్రభుత్వ పాలనపై పట్టులేదు.. వరద ముంపు గురించి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరిక జారీ చేయకపోవడం వల్లే వేలాది మంది కట్టుబట్టలతో నిరాశ్రయు లుగా మిగిలారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే విపత్తు జరిగిందని విమర్శించారు. మంగళవారం బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలో ఖమ్మం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజరు కుమార్, ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి హరీశ్‌రావు మాట్లాడారు. వరద బీభత్సం వల్ల ప్రతి ఇంట్లో 4 నుంచి 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారని చెప్పారు. వరదల్లో చిక్కుకున్న ప్రజానీకానికి ప్రభుత్వం తాగునీరు అందించలేని దుస్థితి దాపురించిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరద బాధితులకు రూ.20లక్షలు ఇవ్వాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని, అదే మాటను ఇప్పుడు వారు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేలు ఏమాత్రం సరిపోవన్నారు. వారికి రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఇప్పటి వరకు ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ జరగలే దన్నారు. వరదల్లో చిక్కుకుని రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది మృతిచెందితే.. ప్రభుత్వం మాత్రం 16 మందని చెప్పడం దురదృష్టకరమన్నారు. గతంలో పంట నష్ట పోయిన రైతాంగానికి ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వాన్ని ప్రస్తుత రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే మాట మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట పొలాల్లో ఇసుక మేటలతో నష్టం కలిగిన రైతాంగానికి రూ.50 వేలు ఇవ్వాలని అన్నారు.
వరద ప్రాంతాల్లో..
తొలుత ఖమ్మంరూరల్ మండలంలోని రాజీవ్ స్వగృహ కల్ప, జలగంనగర్, ఖమ్మం నగరంలోని వెంకటేశ్వర నగర్, మోతీనగర్, గొల్ల బజార్‌లలోని వరదల్లో నష్టపోయిన ప్రజలను బీఆర్‌ఎస్ నేతలు పరామర్శించారు. 48వ డివిజన్‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రవన్న సేవా ఆధ్వర్యంలో 6 లక్షల విలువ చేసే బియ్యం, కాయకూరలను మాజీ మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. ప్రకాష్ నగర్ వరద బ్రిడ్జిపై ఉధృతిలో చిక్కుకున్న 9 మందిని కాపాడిన ఏడుగురిని శాలువా కప్పి అభినందించారు.
ప్రభుత్వ అసమర్థత వల్లే సాగర్ కాలువకు గండి
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లనే సాగర్ కాలువకు గండి పండిందని మాజీ మంత్రులు హరీశ్‌రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం, కాగిత రామచంద్రాపురం గ్రామ సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ కట్ట 132కిలో మీటర్ వద్ద పడిన గండి ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ముఖ్యమంత్రి, మంత్రుల బాధ్యతారాహిత్యమే ఇంతటి నష్టానికి కారణమైందన్నారు. ప్రమాద సమయాల్లో ఓపెన్ చేసే ఎస్కేప్ ఛానల్ ఉన్నప్పటికీ ఉదాసీనంగా వ్యవహరించారని విమర్శించారు. ఎస్కేప్‌ను తెరవాలని రైతులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం పెడచెవిన పెట్టి వారి కన్నీటికి కారణమైందన్నారు. వరదల్లో చిక్కుకున్న వారి కోసం కనీసం ఒక్క హెలికాప్టర్ తీసుకురాలేకపోయారని, విలాసాల కోసమే హెలికాప్టర్ వాడుతున్నారని విమర్శించారు. సాగర్ ఎడమ కాల్వ గండి పాపం ఖమ్మం జిల్లా మంత్రులదే అన్నారు. ఖమ్మం ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చాకే మంత్రులు తేరుకున్నారన్నారు. అనంతరం ఇసుక మేట వేసిన పంట పొలాలను పరిశీలించారు. రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించేవరకు తాము పోరాడుతామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.
బీఆర్‌ఎస్ నాయకుల కార్లపై దాడి
ఖమ్మం నగరం మంచికంటి నగర్‌లో మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ నేతల కార్లపై కొంతమంది రాళ్లతో దాడి చేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజరు కుమార్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ గూండాలను గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం సీపీని కలిసి వినతిపత్రం అందజేశారు.
0