తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు ర్యాంకులను విడుదల చేయగా, ముగ్గురు టీమిండియా బ్యాటర్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 751 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ (740) ఒక స్థానం మెరుగుపరచుకుని ఏడో ర్యాంక్ దక్కించుకున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ (737) రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంక్‌కు చేరాడు. ఇలా ముగ్గురు భారత ఆటగాళ్లు వరుసగా 6, 7, 8 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. కాగా, పాకిస్థాన్ పరిమిత ఓవర్ల సారథి బాబర్ ఆజామ్‌కు ఈ ర్యాంకింగ్స్ లో ఊహించని షాక్ తగిలింది. ఏకంగా ఆరు స్థానాలు కిందికి పడిపోయాడు. దాంతో బాబర్ (734) మూడు నుంచి తొమ్మిదో ర్యాంకుకు దిగజారాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టులో విఫలం కావడమే అతని ర్యాంకుపై ప్రభావం చూపించింది. ఇక, ఇదే టెస్టులో సెంచరీతో అదరగొట్టిన మరో పాక్ బ్యాటర్ రిజ్వాన్ ఏడు స్థానాలు మెరుగుపరచుకుని టాప్-10లోకి చేరాడు. ప్రస్తుతం రిజ్వాన్ (728) పదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. అటు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ 881 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. కివీస్ ప్లేయర్లు కేన్ విలియమ్సన్ (859), డారిల్ మిచెల్ (768) వరుసగా రెండు మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. తాజాగా శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (758) కెరీర్ బెస్ట్ నాలుగో ర్యాంకు సాధించడం విశేషం.
0