హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మాదాపూర్‌లోని హీరో నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతకు సిద్ధమైంది. కూల్చివేతను హైడ్రా అధికారులు ప్రారంభించారు. మూడున్నర ఎకరాల చెరువు స్థలాన్ని N-కన్వెన్షన్ కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. తమ్మిడి హడ్డి చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో నాగార్జున N-కన్వెన్షన్ ఉంది. మొత్తం 29 ఎకరాల 24 గుంటలలో తమ్మిడి హడ్డి చెరువు ఉంది. ఇటీవలే N-కన్వెన్షన్ సెంటర్ కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే N-కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్నారు.
ఇటీవల బాచుపల్లిలో..
ఇటీవల బాచుపల్లి ఎర్రకుంట చెరువు పరిధిలో కట్టిన అపార్ట్‌మెంట్‌లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ప్రగతినగర్ – బాచుపల్లి ఎర్రకుంటలో సర్వే నెంబర్ 134లో 3 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉండేది. చెరువును ఆక్రమించి మాప్స్ కనస్ట్రక్షన్ నిర్మాణం జరిగింది. 1300 గజాల్లో అపార్ట్‌మెంట్‌ను ఓ సంస్థ నిర్మించింది. ఆక్రమణలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాధ్.. బిల్డింగ్‌లను కూల్చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఆ బిల్డింగ్ ను అధికారులు నేలమట్టం చేశారు.