కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీ బూటకమని.. రుణమాఫీ మొత్తం దగా, మోసమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చెబుతున్నవి అర్థసత్యాలు, అసత్యాలన్నారు. రుణమాఫీ Loan waiver కాదని.. రైతులకు కుచ్చు టోపీ అని మండిపడ్డారు. రూ.2 లక్షలు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల చెప్పారు. రుణమాఫీపై ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నారని.. రుణమాఫీపై రైతులకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ జరగక రైతులు రోడ్డెక్కుతున్నరు.. ఏ పత్రిక, ఛానల్ చూసినా ఇవే వార్తలు కనిపిస్తున్నాయి. ఆందోళన చేస్తున్న రైతులపై ఏడేళ్లు, రెండేళ్లు శిక్షలు పడే కేసులు పెడుతూ… మరోవైపు అందరికి రుణమాఫీ అయిందని సీఎం సంబరాలు చేసుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. రూ.31 వేల కోట్లు మాఫీ చేశామని సీఎం చెబుతున్నారు. రుణమాఫీపై మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారు. సాంకేతిక కారణాలతో మాఫీ కాలేదని మంత్రులు చెబుతున్నారు. భట్టి చెప్పిన లెక్కలు వింటే రుణమాఫీ వట్టిదేనని తేలిపోయింది. మాఫీ ఎట్లా ఎగ్గొడదామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తుందని.. అసలు రుణమాఫీపై ప్రభుత్వానికి స్పష్టత ఉందా..? లేదా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
మాఫీ 30 శాతం, కాంగ్రెస్ మోసం 100 శాతమన్న ఆయన ఇది రైతు స్వరాజ్యం కాదు.. ఏడిపిస్తున్న రాజ్యమని ధ్వజమెత్తారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ.. రేపు అన్ని మండల కేంద్రాల్లో రైతుల ధర్నాలు ఉంటాయి. రేపటి ఆందోళనలు మొదటి అడుగు మాత్రమే. రైతులపై కేసులు ఉపసంహరించుకోవాలి. రుణమాఫీ చేయనందుకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఎప్పటిలోగా రుణమాఫీ పూర్తి చేస్తారో చెప్పాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా బీఆర్‌ఎస్ ఉన్నంతకాలం రైతులకు అండగా ఉంటుందని, రైతులు స్థైర్యం కోల్పోవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.