manatelanganatv.com

దర్యాప్తుపై నివేదిక ఇవ్వండి

కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికోపై జరిగిన లైంగిక దాడి, హత్య ఘటనకు సంబంధించి జరుపుతున్న దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు మంగళవారం సీబీఐని ఆదేశించింది. దేశంలోని వైద్య సిబ్బంది భద్రత కోసం అవసరమైన మార్గదర్శకాలను రూపొందించేందుకు జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ మూడు వారాలలో మధ్యంతర నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్‌ జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ కోల్‌కతా ఘటనపై సుమోటోగా విచారణ జరుపుతోంది.


మరో అఘాయిత్యం జరిగే వరకూ ఎదురు చూడలేం
సంఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో జరిగిన జాప్యంపై న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందుకు బెంగాల్‌ ప్రభుత్వాన్ని, ఆస్పత్రి యాజమాన్యాన్ని తప్పుపట్టింది. మరో అత్యాచార ఘటన జరిగే వరకూ దేశం ఎదురు చూడలేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘ఘటన జరిగినప్పుడు బాధితురాలి తల్లిదండ్రులు ఆస్పత్రిలో లేరు. కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఆస్పత్రిదే’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. గురువారం తెల్లవారుజామున ఆస్పత్రిపై వందలాది మంది దాడి చేయడం, ఘటనా స్థలం నుండి కోల్‌కతా పోలీసులు పారిపోయారంటూ ఆరోపణలు రావడంపై న్యాయస్థానం స్పందిస్తూ ఆస్పత్రి ప్రాంగణంలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని నియమించాలని ఆదేశించింది. ‘ఈ ఘటన దేశంలోని వైద్య సిబ్బంది భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. వైద్య సిబ్బంది చాలా తేలికగా హింసకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళా వైద్యులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. చాలా మంది మహిళలు ఉద్యోగులుగా చేరుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మారడానికి మరో అత్యాచారం జరిగే వరకూ దేశం ఎదురు చూడలేదు’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. మహిళలు సురక్షితంగా పనిచేసే పరిస్థితులు కల్పించలేకపోవడం అంటే వారికి సమానత్వం కల్పించడాన్ని నిరాకరించడమే అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏడు వేల మంది ప్రజలు ఆస్పత్రిలో ప్రవేశించడం, వారిలో 80-90 మంది విధ్వంసానికి పాల్పడడం, రెసిడెంట్‌ వైద్యులను బెదిరించడంపై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదేం తీరు?
ఆస్పత్రి యాజమాన్యం, స్థానిక పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. వేలాది మంది ప్రజలు వైద్య కళాశాల ఆస్పత్రిలో ప్రవేశిస్తుంటే వారిని అడ్డుకోవడంలో పోలీసుల వైఫల్యాన్ని నిలదీసింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ బెంగాల్‌లో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదులో జాప్యంపై బెంగాల్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ను ఉద్దేశించి ‘బాధితురాలి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం అప్పగించిన మూడు గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేశారు?’ అని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై సిబల్‌ సమాధానమిస్తూ విచారణ ప్రారంభం కాగానే అసహజ మరణం కేసును నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఆస్పత్రి ప్రిన్సిపాల్‌ ప్రవర్తనపై పరిశీలన జరుగుతుండగానే ఆయనను మరో కళాశాలలో నియమించడాన్ని కూడా న్యాయస్థానం తప్పుపట్టింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై బలప్రయోగం చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికింది.
టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు వీరే
పని ప్రదేశంలో మహిళల భద్రత కోసం జాతీయ ప్రొటోకాల్‌ అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. అందుకోసం సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌పీ సరిన్‌ నేతృత్వంలో పది మంది సభ్యులతో జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది. ఈ కమిటీలో సరిన్‌తో పాటు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి, డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌, డాక్టర్‌ ఎం.ప్రతిమామూర్తి, డాక్టర్‌ గోవర్థన్‌ దత్‌ పూరి, డాక్టర్‌ సౌమిత్రా రావత్‌, ప్రొఫెసర్‌ అనితా సక్సేనా, ప్రొఫెసర్‌ పల్లవి సప్రే, డాక్టర్‌ పద్మ శ్రీవాత్సవ సభ్యులుగా ఉంటారు. మూడు వారాలలో మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీని కోర్టు కోరింది. ఆస్పత్రిపై దాడి చేసి బీభత్సం సృష్టించిన వారిని అరెస్ట్‌ చేసి, వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. బాధితురాలి పోస్ట్‌మార్టం నివేదికను కూడా న్యాయస్థానం కూలంకషంగా పరిశీలించింది.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278