హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, కొత్తపేట, సరూర్ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఈ ఉదయం కురిసిన భారీ వర్షంతో తడిసిముద్దయిన నగరం… ఈ సాయంత్రం కురిసిన వర్షంతో అతలాకుతలమైంది. పలుచోట్ల వర్షం నీరు రోడ్ల పైకి చేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి.
నగరంలో భారీ వర్షం కురవడంతో హుస్సేన్ సాగర్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్‌లో మంగళవారం మధ్యాహ్నం నాటికి నీరు దాదాపుగా ఫుల్ ట్యాంక్ లెవల్ కు చేరుకుంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు కాగా, మధ్యాహ్నం సమయానికి 513.63 అడుగులకు నీరు చేరుకుంది. సాగర్‌లోకి 1850 క్యూసెక్కుల నీరు వస్తుండగా, గేట్లు ఎత్తి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.