ముంబై సమీపంలోని బద్లాపూర్‌లో ఓ స్కూల్‌లో నర్సరీ చదువుతున్న ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై అత్యాచారం ఘటన నగరాన్ని కుదిపేసింది. ఓ ప్రముఖ స్కూల్‌లో చదువుతున్న బాధిత చిన్నారులపై అందులో పనిచేస్తున్న స్వీపరే అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఆగస్టు 12, 13 తేదీల్లో వరుసగా ఈ ఘటన జరిగినా స్కూలు యాజమాన్యం ఫిర్యాదు చేయడంలో అలసత్వం వహించిందంటూ ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. నేడు బద్లాపూర్‌లో బంద్ పాటించారు.
వేలాదిమంది స్కూలు వద్దకు చేరుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్కూల్‌కు వచ్చే అమ్మాయిల భద్రతపై సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ బంద్‌కు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. రిక్షా డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, స్థానిక దుకాణదారులు, రాజకీయ నాయకులు కూడా బంద్‌లో పాల్గొన్నారు.
బాధిత బాలికల్లో ఒకరు స్కూలుకు వెళ్లనని మారాం చేస్తుండడంతో అనుమానించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మరో బాలికకు కూడా ఇలాగే జరిగినట్టు గుర్తించారు. స్కూల్‌లో కాంట్రాక్ట్ స్వీపర్‌గా పనిచేస్తున్న వ్యక్తే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తేల్చారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు దాదాపు 12 గంటలపాటు బాధిత తల్లిదండ్రులను నిలబెట్టడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. వెల్లువెత్తిన ప్రజాగ్రహంతో స్పందించిన స్కూలు యాజమాన్యం ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్‌ను తొలగించడంతోపాటు స్వీపర్లను అందించే ఏజెన్సీతో కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంది. స్కూలు ఎదుట నిరసన తెలిపిన ఆందోళనకారులు ఆ తర్వాత బద్లాపూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. బాధిత బాలికలకు న్యాయం చేయాలని నినదించారు.