ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
లిక్కర్ కేసులో మార్చి 16న కవితను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. నేరుగా ఢిల్లీకి తరలించి మార్చి 16న రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత కవితకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో… మార్చి 26న ఆమెను తీహార్ జైలుకు తరలించారు. కవిత తీహార్ జైల్లో ఉండగానే సీబీఐ రంగంలోకి దిగి ఆమెను అరెస్ట్ చేసింది. మార్చి 26 నుంచి కవిత తీహార్ జైల్లోనే ఉంటున్నారు. ఇటీవల ఆమె అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.