గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్)కు దరఖాస్తు చేసుకొని, వివిధ కారణాలతో నిలిచిపోయిన ఫైళ్లను క్లియర్ చేసేలా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి శుక్రవారం ఎల్‌ఆర్‌ఎస్ సంబంధించిన గైడ్‌లైన్స్‌ను విడుదల చేశారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 2020 ఆగస్టు 26వ తేదీ కంటే ముందు రిజిస్టర్ చేసిన అనుమతిలేని, చట్టవిరుద్ధమైన లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్దీకరించుకొనేలా తాజా ఉత్తర్వులు విడుదల చేశారు. దీనికి సంబంధించి 2020 ఆక్టోబర్ 15 వరకు వచ్చిన దరఖాస్తులకు కూడా ఎల్‌ఆర్‌ఎస్ వర్తిస్తుందని తెలిపారు. దీని నియమ నిబంధనలు 2020లోనే విడుదల చేశారనీ, అప్పటి పెండింగ్ దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను 2024 జనవరిలో ప్రారంభించినట్టు వివరించారు. ఇప్పటివరకు 4,28,832 దరఖాస్తులు ప్రాసెస్ చేయగా, వాటిలో 60,213 దరఖాస్తులు ఆమోదించి, రూ.96.60 కోట్ల సొమ్ము వసూలు చేసినట్టు తెలిపారు. 75 శాతం దరఖాస్తుల్లో పూర్తి స్థాయి డాక్యుమెంట్లు సమర్పించక షార్ట్‌ఫాల్స్‌తో ఉండటం వల్ల, వాటిని అప్‌లోడ్ చేయాలని దరఖాస్తుదారులకు తెలిపామని చెప్పారు. ప్రాసెస్‌ను వేగవంతం చేసేందుకు మున్సిపాలిటీ, కార్పొరేషన్, నగరాభివృద్ధి సంస్థల నుంచి అధికారిక షార్ట్‌ఫాల్స్ లెటర్ కోసం వేచిచూడకుండా పూర్తి స్థాయి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలని కోరారు. ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌లో దరఖాస్తుదారులకు షార్ట్‌ఫాల్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడానికి సౌకర్యం కల్పించామన్నారు. సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ విలువ సర్టిఫికెట్, లేఔట్ కాపీ వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలని చెప్పారు. దరఖాస్తుదారులు తమ మొబైల్ నంబర్, చిరునామా లేదా ఇతర దరఖాస్తు వివరాలను మొబైల్ నంబర్ ఓటీపీ వినియోగించుకుని సవరించుకోవచ్చు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దరఖాస్తుదారుల సందేహాలకు ఇక్కడ వివరణ దొరుకుతుందని తెలిపారు. 2020లో జారీ చేసిన జీవో 131, జీవో 135 ప్రకారం రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయి. 2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిస్ట్రర్ చేసిన లేఅవుట్లకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్ వర్తిస్తుంది. 2020 అక్టోబరు 15వ తేదీలోపు స్వీకరించిన దరఖాస్తులనూ పరిగణనలోకి తీసుకుంటారు.
0