manatelanganatv.com

బర్త్ సర్టిఫికేట్ తేచ్చేలోపు..సర్వనాశనం

ఇజ్రాయెల్–హమాస్‌ల మధ్య యుద్ధం ఎన్ని రోజులు అయినా ఆగడం లేదు. ఇందులో హమాస్ మిలిటెంట్లు చనిపోవడం మాట అటుంచి..అమాయక పాలస్తీనీయులు మాత్రం చనిపోతున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటికి 40వేల మంది అమాయకులు మరణించారు. ఇందులో పిల్లలు, స్త్రీలు చాలా ఎక్కువగా చనిపోతున్నారు. ఇటు నుంచి అటు తిరిగే లోపు ప్రాణాలు పోతున్నాయి. గాజాలో రీసెంట్‌గా జరిగిన ఓ ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలిచి వేస్తోంది. గాజాలో పాలస్తీనీయునికి ఒకరికి రీసెంట్‌గా కవల పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టి నాలుగు రోజులు మాత్రమే అయింది. కానీ పుట్టిన నాలుగు రోజులకే వాళ్ళకు నిండు నూరేళ్ళు నిండిపోయాయి. వారితో పాటూ తల్లి, ఇతర కుటుంబీకులు కూడా చనిపోయారు. తండ్రి బర్త్ సర్టిఫికేట్ తేవడానికి వెళ్ళి వచ్చేలోపు మొత్తం కుటుంబం తుడిచి పెట్టుకుపోయింది. చిన్నారుల బర్త్‌ సర్టిఫికేట్‌ తెచ్చేందుకు వెళ్లిన అతడు.. తిరిగి ఆశ్రయం పొందుతున్న శిబిరానికి వచ్చేసరికి కవలలతో పాటు భార్య కూడా ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్లో కన్నుమూయడం అందరినీ కలిచి వేస్తోంది. ఇదొక్కటే కాదు.. ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను చేతుల్లో పట్టుకొని తల్లిదండ్రులు మోసుకెళుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఇలా వేల మంది చిన్నారులు గాయాలు పాలవుతున్నారు, మరణిస్తున్నారు.

ఇక యుద్ధం కారణంగా గాజా నామరూపాల్లేకుండా పోయింది. లక్షల మంది నివాసాలు కోల్పోయారు. తాత్కాలిక శిబిరాల్లో తల దాచుకుంటున్న వారి పరిస్థితి కూడా దారుణంగా ఉంది. కనీస సౌకర్యాల కోసం వారు తపిస్తున్నారు. స్నానం చేయడానికి కూడా నీళ్లు దొరకడం లేదు. చాలామందికి చర్మవ్యాధులు సోకాయి. మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉంది. గాయాలకు రాసే చిన్న ఆయింట్‌మెంట్ ధర ఏకంగా 53 డాలర్లు ఉంది. రఫా సరిహద్దును ఇజ్రాయెల్‌ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అంతర్జాతీయ మానవతా సాయం కూడా తగ్గిపోయింది. ఆ సరిహద్దును దాటితేనే కావాల్సిన ఔషధాలు లోపలికి వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం గాజాలో నివాసయోగ్యమైన పరిస్థితులు లేకపోవడం వల్ల మరిన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

Leave a Comment