తెలంగాణ సర్కారులో ఓ ఐఏఎస్ తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి లాభం చేస్తున్నాననే ఆలోచనతో దూకుడు చూపిన ఆ ఐఏఎస్ వల్ల ప్రభుత్వానికి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెతలా రాష్ట్ర ప్రభుత్వమే చుక్కలు లెక్కిస్తోందట. ఏదో అనుకుంటే ఇంకేదో అవ్వడంతో ఆ ఐఎఎస్ కూడా అయ్యా ఎస్ అనాల్సి వస్తోందంటున్నారు.
తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యగా మారింది. రాష్ట్రానికి చెందిన కొన్ని సంస్థలు 1400 కోట్ల రూపాయలకుపైగా జిఎస్టీ ఎగవేతకు పాల్పడ్డినట్లు వాణిజ్యశాఖ అనుమానం వ్యక్తం చేసింది. మొత్తం 11 సంస్థలు ఎగవేతకు పాల్పడినట్లు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ టీకే శ్రీదేవి గుర్తించారు. దీంతో జాయింట్ కమిషనర్ రవితో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దాదాపు 1400 కోట్ల పన్ను ఎగవేత అనగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే యాక్షన్‌లోకి దిగింది. సీఐడీకి కేసును అప్పగించింది.
సీఐడీ అసలు బాగోతాన్ని తేల్చే పనిలో పడింది. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, రాష్ట్ర జీఎస్టీ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వర రావు, జాయింట్ కమిషనర్ శివరాం ప్రసాద్, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు లపై కేసు నమోదు చేసింది సీఐడీ. ఇలా ఈ కేసుపై సీఐడీ కూపీ లాగుతుండగానే సెంట్రల్ జీఎస్టీ ఎంట్రీ ఇచ్చింది. ఎగవేత మొత్తంలో సగం తమకు రావాలని.. పన్ను ఎగవేతదారుల పేర్లు ఇవ్వాలని లేఖ రాసింది. ఇక్కడే అసలు ట్విస్టు బయటపడటంతో ప్రభుత్వ పెద్దలు… అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
భారీ మొత్తంలో పన్ను ఎగవేశారని ఫిర్యాదు చేసిన జాయింట్ కమిషనర్ రవిని సీఐడీ విచారించగా, తన వద్ద ఆధారాలు ఏమీ లేవని ఆయన చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారంటున్నారు. తనకు అప్పటి కమిషనర్ శ్రీదేవి చెబితేనే ఫిర్యాదు చేశానని.. అంతకుమించి తనకేం తెలియదని జాయింట్ కమిషనర్ చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. పూర్తి సమాచారం లేకుండానే కేవలం అనుమానంతో కేసు పెట్టడంపై ప్రభుత్వ పెద్దలు సైతం గుర్రుగా ఉన్నారంటున్నారు. పైగా పన్ను ఎగవేశారని ఐఏఎస్ అధికారి టీకే శ్రీదేవి అనుమానం వ్యక్తం చేసిన సంస్థల్లో కొన్ని ప్రభుత్వ సంస్థలూ ఉండటంతో ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు పోలీసులు.