తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అర్హుల ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సబ్‌కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ఈ కమిటీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డు లబ్దిదారుల ఎంపికపై అధ్యయనం చేసి విధివిధానాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ప్రస్తుతం రేషన్ కార్డు లబ్దిదారులకే ఉచిత ఆరోగ్య వైద్య సేవలు (హెల్త్ కార్డు) అందుబాటులో ఉన్నాయి. అయితే ఉచిత వైద్య సేవల కోసం అనర్హులు కూడా రేషన్ కార్డులు పొందుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రేషన్ కార్డు, హెల్త్ కార్డు లింక్‌ను తొలగించి వేర్వేరుగా కార్డులు మంజూరు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.