జన్ ధన్ ఖాతాలతో పాటు బేసిక్ సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచవలసిన అవసరం లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. తమ ఖాతాలలో మినిమం బ్యాలెన్స్ ఉంచని ఖాతాదారుల నుంచి బ్యాంకులు వేలాది కోట్ల రూపాయలు వసూలు చేశాయన్న అంశంపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… మినిమం బ్యాలెన్స్ లేకుంటే పెనాల్టీ వసూలు చేస్తున్నప్పటికీ… పై రెండు ఖాతాలకు మాత్రం మినహాయింపు ఉంటుందని వెల్లడించారు.
2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి అయిదేళ్ల కాలంలో పీఎస్‌బీలు రూ.8,500 కోట్ల జరిమానాలు వసూలు చేసినట్లు లోక్ సభలో ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఇందులో 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే డిపాజిటర్ల నుంచి రూ.2,331 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు.