ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పానీ పూరీ వ్యాపారి మేఘావత్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీలో ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఆహ్వాన ప్రతిని పోస్ట్ ద్వారా అందుకున్నట్లు చిరంజీవి సోమవారం తెలిపారు.
కాగా, చిరంజీవి తన వ్యాపార వృద్ధి కోసం జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద రుణం తీసుకున్నారు. బకాయిలను సకాలంలో చెల్లించడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించినందుకుగాను ఆయకు ఈ ఆహ్వానం అందినట్లు అధికారులు చెప్పారు.
తనకు అందిన ఈ అరుదైన ఆహ్వానం పట్ల ఆనందంగా ఉందని మేఘావత్ చిరంజీవి తెలిపారు. తనకు ఆహ్వానం పంపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.