రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులందరికీ రుణమాఫీ చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. అన్ని అర్హతలు ఉండి కూడా అధికారుల నిర్లక్ష్యంతో మాఫీ కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ కాని సంగారెడ్డి జిల్లా రైతులు వ్యవసాయ కార్యాలయం ఎదుట బారులు తీరారు. నిజామాబాద్ జిల్లాలో బ్యాంకులు, సొసైటీల ఎదుట బైటాయించి ఆందోళనలు చేపట్టారు.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్‌లో అధికారుల తప్పిదం వల్లనే తమకు రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్యాంకు ఎదుట రైతులు శుక్రవారం బైటాయించారు. అర్హులైన సన్న, చిన్న కారు రైతులకు రుణమాఫీ రాకపోవడానికి అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం మొత్తంలో కెనరా బ్యాంకులో మాత్రమే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆర్ఎం వచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని, అవసరమైతే అధికారులను నిర్బంధిస్తామని భీష్మించి కూర్చున్నారు. రైతన్నలు లేకపోతే బ్యాంకులు ఎలా పనిచేస్తాయని వారు ప్రశ్నించారు. బ్యాంకు మేనేజర్ నాగనాథ్ రైతుల వద్దకు వచ్చి రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులను రప్పించాలని రైతులు పట్టుపట్టారు. ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకునే వరకు తాము ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. త్వరలోనే బ్యాంకుల్లో జరిగిన తప్పిదాల గురించి సరిచేసి ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా చర్యలు తీసుకుంటామని బ్యాంకు మేనేజర్ నాగనాథ్ హామీ ఇవ్వడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు.
సొసైటీ అధికారుల నిర్లక్ష్యంతో రుణమాఫీ వర్తించలే
శుక్రవారం ‘నవతెలంగాణ’ పత్రికలో ‘సొసైటీ అధికారుల నిర్లక్ష్యం’ అనే శీర్షికతో వచ్చిన వార్తకు స్పందనగా రుణమాఫీ కాని రైతులు ప్రాథమిక సహకార సంఘం వద్దకు వచ్చి ఆందోళన చేశారు. సొసైటీ కార్యదర్శి సంతోష్‌ను రైతులు నిలదీశారు. ‘ఏం చేయమంటారు’ అంటూ కార్యదర్శి దబాయించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ లోన్ కార్యదర్శి కట్టాలంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపటికి సొసైటీ ప్రస్తుత ఇన్‌ఛార్జి చైర్మెన్ అశోక్ కలుగజేసుకొని రుణమాఫీి రాని రైతుల లిస్ట్ ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని రైతులను శాంతింపజేశారు. తాము రుణమాఫీకి అర్హులమైనప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అర్హులైన రైతులకు న్యాయం చేయకుంటే సంబంధిత మంత్రిని, సీఎంను కలవడానికైనా సిద్ధంగా ఉన్నామని రైతులు అంటున్నారు.
వ్యవసాయ కార్యాలయం ఎదుట బారులు
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలో రెండో విడతలోనూ రుణమాఫీ జరగని రైతులు శుక్రవారం వ్యవసాయ అధికారి కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంబంధిత శాఖ అధికారి మాత్రం రైతులకు అందుబాటులో లేరని, ఇదేంటని అడిగితే జిల్లా కేంద్రంలో సమావేశంలో ఉన్నానంటూ చెబుతున్నారని పుల్కల్ గ్రామానికి చెందిన రైతు బెస్త రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ జరగని రైతులు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆరేండ్ల నుంచి తనకు రైతుబంధు కూడా రావడం లేదని రైతు రాజు వాపోయాడు. ఈ విషయాన్ని పలుమార్లు వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
0