ముంబైలోని ఓ నగల షాపులో దొంగలు భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఏకంగా రూ.11 లక్షల విలువైన నగలను తస్కరించారు. ఖారగర్ ప్రాంతంలోని ఓ దుకాణంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘నిందితులు నల్లని దుస్తులు, ముఖానికి మాస్కులు ధరించి రివాల్వర్లతో షాపులోకి వచ్చారు. సిబ్బందిని భయపెట్టి, దాడి చేసి రూ.11.80 లక్షల విలువైన నగలను తీసుకెళ్లిపోయారు. మూడు నిమిషాల వ్యవధిలో వారు గాల్లోకి నాలుగు నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు’’ అని పోలీసులు తెలిపారు.
నగలతో ముగ్గురు నిందితులు బైక్పై పారిపోతుండగా కొందరు వారిని వెంబడించే ప్రయత్నం చేసిన దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా, ఘటనపై భారత న్యాయసంహిత, ఆయుధాల చట్టం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించారు.