రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్న మాటలు అన్నదాతలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో గడువులోపు రుణమాఫీ పూర్తవుతుందా? అనే సందేహాలు నెలకొన్నాయి. ‘నెలాఖరులోపు లక్షన్నర వరకు మాఫీ చేస్తం. ఆగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తం. నేను విదేశాలకు వెళ్లి వచ్చిన వెంటనే రుణమాఫీ పూర్తిచేస్తం’ అని సీఎం రేవంత్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర చౌరస్తాలో దివంగత జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆదివారం ఆవిష్కరించిన అనంతరం కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే రుణమాఫీపై రైతాంగంలో గందరగోళం నెలకొన్నది. లక్షలోపు రుణాలన్నీ మాఫీ చేసినట్టు ప్రభుత్వం చెప్తున్నా.. దాదాపు సగం మంది రైతులు తమకు జరగనే లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో తన విదేశీ పర్యటన తర్వాత రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి తాజాగా చెప్పడంతో అనుమానాలు మరింత తీవ్రమయ్యాయి.
అసలు సీఎం విదేశీ పర్యటనకు, రుణమాఫీ అమలుకు సంబంధం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది. మరోసారి రుణమాఫీ గడువు మారుతున్నదా అనే చర్చ జరుగుతున్నది. ఎన్నికలకు ముందు డిసెంబర్ 9న రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ తేదీ మారిపోయింది. మొదట్లో ఆ హామీని కాంగ్రెస్ సర్కార్ అటకెక్కిస్తున్నదన్న ప్రచారమూ సాగింది. ‘ఆగస్టు 15లోపు రుణమాఫీ సహా గ్యారెంటీలన్నీ అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా..?’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసరడంతో.. రేవంత్‌రెడ్డిపై ఆ ఒత్తిడి బలంగా పనిచేసింది. దీంతో ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తిచేస్తామని రేవంత్ ప్రకటించాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో నిర్వహించిన అన్ని సభల్లోనూ ఆగస్టు 15 లోపు రుణమాఫీపై దేవుళ్లందరి మీద రేవంత్ ఒట్లు పెట్టారు. తాజాగా కల్వకుర్తి సభలో మాత్రం ఆగస్టు 15 అని అనకుండా ఆగస్టులోగా చేస్తామంటూ నర్మగర్భపు వాఖ్యలు చేశారని, దీని వెనుక ఏదో మర్మం ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పర్యటనకు.. రుణమాఫీకి సంబంధమేంటి?
తాను 14 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నానని, తిరిగి రాగానే మొత్తం రుణమాఫీ చేస్తానంటూ సీఎం చేసిన ప్రకటనపై నిపుణులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. విదేశీ పర్యటనకు రుణమాఫీ పూర్తికి సంబంధమేమిటని ప్రశ్నిస్తున్నారు. 14న వస్తే 15లోగా రుణమాఫీ చేయవచ్చు కదా అని సందేహిస్తున్నారు. తమకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి సభలో మహిళలు నిరసన తెలిపారు. ఆదివారం జరిగిన సభలో నియోజకవర్గ అభివృద్ధికి 309 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారం భం కాగానే డిమాండ్లతో కూడిన పేపర్లను ప్రదర్శించారు. పోలీసులు వచ్చి కాగితాలను గుంజుకున్నారు.