తాను ఇంకా రెడ్‌బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్‌బుక్‌కు ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన నిన్న అసెంబ్లీ లాబీలో లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జగన్ లేవనెత్తిన రెడ్‌బుక్ గురించి మాట్లాడడంపై స్పందించారు.
రెడ్‌బుక్ అనేది రహస్యమేమీ కాదని, తన వద్ద ఆ పుస్తకం ఉన్నట్టు దాదాపు 90 సభల్లో చెప్పానని గుర్తు చేశారు. తప్పుచేసిన వారందరి పేర్లు అందులో చేర్చి చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్టు లోకేశ్ స్పష్టం చేశారు.
నిజానికి తానింకా రెడ్‌బుక్ తెరవనే లేదని లోకేశ్ పేర్కొన్నారు. గతంలో జగన్ ఒకసారి ఢిల్లీ వెళ్లినప్పుడు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ ఇవ్వాలన్న అంశంపై స్పందించమని జాతీయ మీడియా కోరితే.. విజయసాయిరెడ్డి మాట్లాడతాడంటూ వెళ్లిపోయిన జగన్ ఇప్పుడు అదే మీడియాను బతిమాలి పిలిపించుకుని మరీ రెడ్‌బుక్‌కు ప్రచారం కల్పిస్తున్నారని చెప్పారు.
గత ఐదేళ్లలో రెండంటే రెండుసార్లు ప్రెస్‌మీట్లు పెట్టిన జగన్, ఎన్నికల్లో ఓటమి తర్వాత గత నెల రోజుల్లో 5 ప్రెస్‌మీట్లు పెట్టారని లోకేశ్ ఎద్దేవా చేశారు. అక్కడ మాట్లాడే అబద్ధాలేవో అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే తాము సమాధానం ఇస్తామని చెప్పారు.