ఏపీలో అరాచకపాలన సాగుతోందంటూ.. డిల్లీ స్థాయిలో గొంతెత్తిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఏపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. రాష్ట్రం పురోగతి రివర్స్‌లో నడుస్తోందని ఎద్దేవా చేశారు. గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోందని ఆరోపించారు. ప్రశ్నించే వాళ్లను అణచివేసే ధోరణితో చంద్రబాబు పాలన సాగుతోందని మండిపడ్డారు. విధ్వంస పాలన కొనసాగుతుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు అరాచకపాలనపై పోరాటానికి వైఎస్సార్ సిద్ధంగా ఉందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ కూడా పెట్టలేని అధ్వానమైన స్థితిలో చంద్రబాబు సర్కార్ ఉందని ధ్వజమెత్తారు. ఏడు నెలల ఓటాన్ బడ్జెట్ పెడుతోంది. పూర్థిస్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం బాబు ప్రభుత్వానికి లేదంటే, పాలన ఎంతటి అధ్వాన్నస్థితిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు జగన్. చంద్రబాబు మోసపూరిత హామీలు కేటాయింపులు చూపించలేకనే బడ్జెట్ పెట్టలేకపోతుందని విరుచుకుపడ్డారు. రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉందని చంద్రబాబు గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థికస్థితి బాగులేకనే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదని వైఎస్ జగన్ విమర్శించారు.
శ్వేత పత్రాలతో రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జూన్ దాకా, చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అప్పులకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైఎస్ జగన్ వివరించారు. చంద్రబాబు కంటే తమ హయంలోనే తక్కువ అప్పులు చేశామని అంటున్నారు మాజీ సీఎం జగన్. మార్చి వరకు ఏపీకి ఉన్న అప్పులు 4 లక్షల 85 వేల కోట్లు అయితే ఒక రిపోర్ట్‌లో 10 లక్షల కోట్లు అని, మరో రిపోర్ట్‌లో 14 లక్షల కోట్లు అప్పు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు