ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు సమయం ఆసన్నమైంది. దీంతో పన్ను ఆదా ఎలా? అన్న ప్రశ్న మళ్లీ అందరి మదిలో మెదులుతున్నది. అయితే ఇందుకు కొన్ని మార్గాలున్నాయి. వాటిలో.. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎఫ్డీ, ఎల్ఐసీ పాలసీలు, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ తదితర పెన్షన్ ప్లాన్లలో పెట్టుబడులు కొన్ని. ఏటా రూ.1.5 లక్షలదాకా పన్ను మినహాయింపులను పొందవచ్చు. అలాగే ఉద్యోగులు వీలుంటే హెచ్ఆర్ఏతోపాటు టెలిఫోన్/ఇంటర్నెట్ ఖర్చుల రీయింబర్స్మెంట్, ఎడ్యుకేషన్ అలవెన్సులు, ఫుడ్ కూపన్స్ను ఎంచుకోవచ్చు.
ఈపీఎఫ్ విరాళాలను పెంచుకోవడం కూడా కలిసొచ్చే అంశమే. ఇల్లు కొనే ఆలోచన ఉంటే.. గృహ రుణంపై పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద లక్షన్నర రూపాయల వరకు లాభం పొందవచ్చు. వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యుల పేరిట తీసుకొనే ఆరోగ్య బీమాలకు చెల్లించే ప్రీమియంలపైనా రూ.50,000 వరకు పన్ను తగ్గింపులను కోరవచ్చు.