తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ ప్రకటిస్తామని వెల్లడించారు. ఇప్పటికే 11 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, త్వరలో ప్రకటించే డీఎస్సీ ద్వారా మరో 5 వేల నుంచి 6 వేల పోస్టుల వరకు భర్తీ చేస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే ఉద్యోగాల కోసం అని, నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 16 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామని, వెంటనే డీఎస్సీ ప్రకటించామని గుర్తుచేశారు.
ఇదే చివరి డీఎస్సీ కాదని, మరిన్ని డీఎస్సీలు ప్రకటిస్తామని తెలిపారు. త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే తమ లక్ష్యమని భట్టి విక్రమార్క చెప్పారు.