రైతు బంధు స్కీమును తనకు అనుకూలంగా మార్చుకుని అతిపెద్ద స్కామ్‌కు పాల్పడ్డాడు ఒక భూ యాజమాని. వ్యవసాయ భూమిగా ఉన్న పోలాన్ని ఓపెన్ ప్లాట్లుగా మార్చాడు. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఘట్‌కేసర్ మండలంలో చోటు చేసుకుంది. అయితే అదే క్రమంలో రైతు ముసుగు వేసుకుని తన పొలంలో వ్యవసాయం చేస్తున్నట్లు చూపించి కొంత కాలంగా ప్రభుత్వం అందించే రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ తన 33 ఎకరాల భూమికి సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకం ద్వారా రూ. 16లక్షలు పొందినట్లు అధికారులు గుర్తించారు. పంట పండించే భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి ప్రయోజనాలను మోసపూరితంగా క్లైయిమ్ చేసినందుకు ఆ భూ యాజమానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తన పంటపొలాలను కొన్ని సంవత్సరాల క్రితం చట్టవిరుద్ధంగా ప్లాట్‌లుగా మార్చాడు. ఆ ఫ్లాట్లకు సర్వే నంబర్లు కేటాయించి క్రయవిక్రయాలు జరిపాడు.
ఘట్‌కేసర్ మండలం పోచారం గ్రామానికి చెందిన ఎం.యాదగిరిరెడ్డి 38, 39, 40 సర్వే నంబర్‌లోని 33 ఎకరాలను ప్రైవేటు డెవలపర్ల సహకారంతో అక్రమ లే అవుట్లుగా మార్చాడు. వాటిని ఇప్పటికే చాలా మందికి విక్రయించాడు. తద్వారా ఆర్థికంగా లబ్ధి పొందాడు. ఇలా ప్రైవేట్ వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదిస్తూనే.. ప్రభుత్వం తరఫున ప్రతి ఏడాది వచ్చే రైతు బంధు నిధులను కూడా పొందాడు. దీనిపై రెవెన్యూశాఖ స్పందించి రికవరీ చట్టం కింద కేసు నమోదు చేసి నోటీసులు పంపించింది. గత కొన్నేళ్లుగా వ్యవసాయ భూమిగా వర్తించే దానిని కమర్షియల్ ఓపెన్ లే అవుట్లుగా మార్చి వ్యాపారం చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పొందిన డబ్బులను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఆ నోటీసుల్లో ఈ భూమి కేవలం వ్యవసాయానికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల ప్రకారం రికవరీ డబ్బులు చెల్లించకపోతే.. భూములను చట్టవిరుద్దంగా ప్లాట్లుగా మర్చి విక్రయించిన కేసులో కూడా శిక్షపడే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ భూ యాజమాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.