కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇదిలాఉంటే.. అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీ చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ.. మరో ఎమ్మెల్సీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావటం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగునీరు అందించే నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని సీఎంను ఎమ్మెల్సీ చల్లా కోరినట్లు తెలుస్తోంది. చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై స్పష్టత ఇవ్వకపోయినా.. రెండుమూడు రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం.