ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో భేటీ అయ్యారు. ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు. బాబుకు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయి.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు చంద్రబాబు నాయుడు. ఈ మేరకు పరిష్కారం దిశగా ముందుగా తెలంగాణ సీఎంకు లేఖ రాశారు చంద్రబాబు. ఇందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. దీంతో వెను వెంటనే హైదరాబాద్ వేదికగా సమావేశం అయ్యారు ముఖ్యనేతలు.
ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్‌కుమార్ ప్రసాద్, శాంతికుమారి, తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారులు భవనాలశాఖ మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్‌తో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.