దక్షిణ కొరియాలో ఆశ్చర్యపరిచే సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి గుమి నగర కౌన్సిల్ కార్యాలయంలో సేవలందించే ఒక రోబో.. కౌన్సిల్ భవనం మెట్లదారిపై ధ్వంసమై పడిపోయింది. అయితే, రోబో ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం జరుగుతున్నది. రోబో దానికదే మెట్లపై నుంచి కింద పడిందని, ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో దక్షిణ కొరియా వాసులు రోబో ఆత్మహత్య చేసుకుందని చెప్తూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ ఘటనకు ముందు రోబో.. ఏదో వెతుకుతున్నట్టుగా అటూఇటూ తిరుగుతున్నదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని, ముక్కలైన రోబో భాగాలను దానిని తయారుచేసిన కంపెనీకి పంపిస్తామని అధికారులు తెలిపారు.
దక్షిణ కొరియాలో రోబోలను విరివిగా వాడుతుంటారు. కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ తయారుచేసిన ఈ రోబోను 2023 అక్టోబరు నుంచి గుమి నగర కౌన్సిల్‌లో వినియోగిస్తున్నారు. అధికారులకు డాక్యుమెంట్లు అందించడం, ప్రజలకు సమాచారం ఇవ్వడం వంటి పనులు చేసేది. కాగా, గతంలో వాషింగ్టన్‌లోనూ ఒక ఫౌంటెయిన్ వద్ద ఇదే రకంగా రోబో ధ్వంసమైంది. అప్పుడు కూడా రోబో ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం జరిగింది. అయితే, అది జారిపడి ధ్వంసమైందని తర్వాత విచారణలో వెల్లడైంది.